హైదరాబాద్: యంగ్ రెబెల్‌స్టార్ ప్రభాస్ నటించిన ‘సాహో’ సినిమాపై రోజురోజుకీ అంచనాలు పెరిగిపోతున్నాయి. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ కథానాయిక. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఓ గ్రాండ్ పాటను చిత్రీకరించబోతున్నారట. అంతర్జాతీయ గాయకులు బియాన్సే, జేజీ, మిస్సీ ఈలియట్ పాటలకు డ్యాన్స్ చేసిన లారెంట్ నికోలాస్, లారీ నికోలాస్‌లు ఈ పాటలో ప్రభాస్‌తో కలిసి డ్యాన్స్ చేయబోతున్నారట. లారెంట్, నికోలాస్ కవలలు. వీరిద్దరికీ డ్యాన్సర్లుగా అంతర్జాతీయ గుర్తింపు ఉంది. అంతేకాదు ఈ ఒక్క పాట కోసం చిత్రబృందం భారీగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. వివిధ విదేశీ డ్యాన్సులను ఈ పాటలో జోడించనున్నట్లు ఫిలిం వర్గాల సమాచారం. అంతేకాదు జాతీయ అవార్డు అందుకున్న ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ వైభవి మర్చెంట్ ఈ పాటకు డ్యాన్స్ కంపోజ్ చేయనున్నారు. సినిమాకు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలు ఇలా ఒక్కొక్కటీ బయటికి వస్తుండడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగిపోతోంది. ఇందులో బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేశ్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. మందిరా బేడీ, ఎవ్లిన్ శర్మ, జాకీ ష్రాఫ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో ప్రభాస్ ఏజెంట్ పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. స్పై థ్రిల్లర్‌గా దీనిని తెరకెక్కిస్తున్నారు. హాలీవుడ్ రేంజ్‌లో పోరాట సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. దుబాయ్‌లో ఎక్కువ శాతం చిత్రీకరణ జరిగింది. ఆగస్ట్15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.