ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతిని కూకటివేళ్లతో సహా పెకలించడానికి వైఎస్ జగన్ సర్కార్ చర్యలకు ఉపక్రమించింది. రాష్ట్రంలో అవినీతి వ్యవహారాల పైన ఫిర్యాదుల కోసం ప్రభుత్వం కొత్తగా కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది.అవినీతిపై ఫిర్యాదు చేయడానికి గత తెదేపా ప్రభుత్వం 1100 కాల్‌సెంటర్ ప్రారంభించిన విషయం తెలిసిందే.దీంతోపాటు అవినీతి నిరోధక శాఖ కూడా అవినీతిపై ఫిర్యాదులు చేయడం కోసం 1064 టోల్‌ఫ్రీ నంబర్ అందుబాటులోకి తెచ్చింది.ఈ రెండు నంబర్లకు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ రెండు నంబర్లకు అదనంగా జగన్ ప్రభుత్వం మరో కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న నూతన కాల్ సెంటర్ కు కొత్తగా 10044 అనే టోల్‌ఫ్రీ నంబర్‌ను కేటాయించారు. సీఎం జగన్ తాడేపల్లిలోని తన నివాసం నుం చి దీన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, పౌరసేవల్లో అవినీతిని నిరోధించాలని ముఖ్యమంత్రి ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసారు.జిల్లా కలెక్టర్లు..ఎస్పీలు సైతం దీని మీద ఫోకస్ పెట్టాలని ఆదేశించారు. అవినీతిపై యుద్ధం అంటున్న జగన్ ప్రభుత్వం కొత్తగా 10044 అనే టోల్‌ఫ్రీ నంబర్‌ను తీసుకొస్తోంది. ఈ కాల్ సెంటర్ కు వచ్చే ఫిర్యాదులను స్వయంగా ఇంటలిజెన్స్, ఐఏస్, ఏసీబీ అధికారి పర్యవేక్షణలో స్వీకరించటంతో పాటుగా వాటి మీద చర్యల దిశగా యంత్రాంగం పని చేస్తుంది. ఇక నుండి అవినీతిపై ఫిర్యాదులు రుజువు ఐతే ఇక ఇంటికే పంపుతామని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.