ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీ మంత్రుల,నేతల వ్యాఖ్యలు రోజురోజుకు హద్దు మీరుతున్నాయి.అధికారంలో ఉన్నామనే అహంకారమో లేక ఏం మాట్లాడినా ప్రశ్నించేవాడు లేడనే ధీమానో తెలియడం లేదు కానీ వైసీపీ మంత్రుల,ఎమ్మెల్యేలు,నేతల వ్యాఖ్యలు శృతి మించుతున్నాయి.కొద్ది రోజుల క్రితం మంత్రి కొడాలి నాని తిరుమల తిరుపతి దేవస్థానంపై నోటి దురుసు వ్యాఖ్యలు మరచిపోక ముందే మరో మంత్రి నోటి దురుసు వ్యాఖ్యలు చేశాడు.నిరుద్యోగులను ఉద్దేశించి మంత్రి ధర్మాన కృష్ణప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నరసన్నపేటలో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో నిరుద్యోగులను ఉద్దేశించి బిస్కెట్ వేస్తే కుక్క, కొంచెం గడ్డి వేస్తే పశువులు ఎంతో విశ్వాసంగా ఉంటాయని ఏపీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. కానీ, ముఖ్యమంత్రి జగన్ ఎన్నో మంచి పనులు చేస్తున్నా… చప్పట్లు కొట్టడం లేదంటూ నిరుద్యోగులను ఉద్దేశించి మంత్రి అసహనం వ్యక్తం చేశారు. ఒక నిజాయతీపరుడికి కావాల్సింది మీ చప్పట్లు, మీ హర్షధ్వానాలే కదా? అని అన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే సచివాలయ, గ్రామ వాలంటీర్ల ఉద్యోగాలను ఇచ్చామని… ఇంత చేస్తున్న సీఎం పట్ల కృతజ్ఞత ఉండాలా? వద్దా? అని ప్రశ్నించారు.మంత్రి వ్యాఖ్యలు చూస్తుంటే వైఎస్ జగన్ ఏదో దయతలచి ఉద్యోగాలు ఇస్తున్నారని అందుకు ప్రతి ఒక్కరూ కృతజ్ఞతగా ఉండాలన్నట్లు ఉన్నాయి.వైసీపీలో వైఎస్ జగన్ భజన,వ్యక్తిపూజ హద్దులు దాటుతున్నాయని ప్రజలను,ప్రజల మనోభావాలను కించపరిచేలా వైసీపీ నేతలు,మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలను చూస్తే ఉపేక్షిస్తే తెదేపాకు పట్టిన గతే వైసీపీ కూడా పడుతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి..