ముంబై: అజిత్ పవార్.ఇప్పుడు దేశ వ్యాప్తంగా, వెన్నపోటుదారుగా, మహారాష్ట్ర చంద్రబాబుగా మారు మోగుతున్న పేరు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల్ని వంచించి కమలనాధుల్ని అధికార పీఠానికి ఎక్కించిన నేత ఆయనే. ఎన్సీపీని నిట్టనిలువునా చీల్చి మహారాష్ట్ర రాజకీయాలకు ఊహకందని మలుపునిచ్చిన ‘నాయకుడు‘. కేవలం రాత్రికి రాత్రే కొన్ని గంటల వ్యవధిలో మహా రాజకీయాల వంపులు తిప్పిన అజిత్ పవార్ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సొంత అన్నయ్య కొడుకు. గోవింద రావ్ పవార్ దంపతులకు 11 మంది సంతానం. వారిలో శరద్ పవార్ అన్నయ్య అనంతరావ్ పవార్. ఆయన కుమారుడే అజిత్ పవార్. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ ‘రాజ్ కమల్ స్టూడియోస్’లో అనంతరావ్ పవార్ పని చేసారు. 1959లో పుట్టిన అజిత్ పవార్ ఎస్ఎస్సీ చదువుతున్నపుడు తండ్రి హఠాన్మరణం పాలయ్యారు. దీంతో విద్యాభ్యాసాన్ని వదిలి కుటుంబ బాధ్యతల్ని చేపట్టారు. అప్పుడే కాంగ్రెస్ పార్టీలో బలమైన నేతగా శరద్ పవార్ ఎదిగారు. చదువును కొనసాగించడానికి పూణె జిల్లా నుంచి అజిత్ పవార్ ముంబై చేరారు. 1982లో రాజకీయరంగ ప్రవేశం చేశారు. సహకార చక్కెర మిల్లు పాల్ మండలి సభ్యుడుగా ఎన్నిక య్యారు. ఆ తర్వాత 1991లో పూణె జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్ గా ఎన్నికై 16 సంవత్సరాలు కొనసాగారు. బారా మతి లోక్ సభ నియోజకవర్గం నుంచి గెలిచారు. ఆ తర్వాత తన చిన్నాన్న శరద్ పవార్ కోసం బారామతి స్థానాన్ని త్యాగం చేశారు. అక్కడి నుంచి గెలిచిన శరద్ పవార్ పీవీ నరసింహారావు కొలువులో రక్షణ మంత్రిగా పని చేసారు. ఆ తర్వాత బారా మతి ఎమ్మెల్యేగా అజిత్ పవర్ 1995, 1999, 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో జయకేతనం ఎగురేసారు. కాంగ్రెస్ ప్రభు త్వం, కాంగ్రెస్-ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వాల్లో మంత్రిగా పని చేశారు. మహారాష్ట్ర మాజీ మంత్రి పదంసిన్హ్ పాటిల్ కుమార్తె సునే త్రను అజిత్ పవార్ పెళ్లాడారు. వారికి ఇద్దరు కుమారులు.