ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మరో విదేశీ సంస్థ పెట్టెబేడా సర్దుకొని ప్యాకప్ చెప్పి వెళ్లిపోయింది.యూఏఈ దేశానికి చెందిన లూలూ గ్రూప్ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టలేమంటూ చేతులెత్తేసి వెళ్లిపోయింది.గత తెదేపా ప్రభుత్వం విశాఖపట్టణంలో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు లులూ గ్రూప్ సంస్థకు విశాఖపట్నంలో భూమి కేటాయించింది.అయితే ఈనెల ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం భూకేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని భావించి వాటిని రద్దు చేసింది.దీంతో భూకేటాయింపు పారదర్శకంగానే జరిగిందని ఇప్పుడు జగన్ ప్రభుత్వం రద్దు చేయడం సరికాదని లులూ గ్రూప్ యాజమాన్యం వెల్లడించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాబట్టి తాము అంగీకరిస్తామని చెబుతూనే… భవిష్యత్తులో ఇకపై ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టమని తేల్చి చెప్పింది.భూకేటాయింపుకు పారదర్శకతతో కూడిన బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొన్నామని చెప్పిన లులూ యాజమాన్యం తమకే ఆ భూమి లీజుపై దక్కిందని చెప్పింది. ఇప్పటికే ప్రాజెక్టు పనుల కోసం తాము ఇంటర్నేషనల్ కన్సల్టెంట్లకు డబ్బులు చెల్లించామని, దీనివల్ల చాలా నష్టపోవాల్సి వస్తుందని లులూ గ్రూప్ ఇండియా డైరెక్టర్ అనంత్ రామ్ వెల్లడించారు.యూఏఈ ప్రధాన కేంద్రంగా తమ కంపెనీ పనిచేస్తోందని ఏపీలో రూ.2,200 కోట్లు పెట్టుబడులు పెట్టి ఒక ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని భావించినట్లు చెప్పారు అనంతరామ్. ఇందులోనే షాపింగ్ మాల్, ఫైవ్ స్టార్ హోటల్ కూడా నిర్మించి తద్వారా విశాఖపట్నంకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావాలని భావించినట్లు చెప్పారు. అంతేకాదు ఈ ప్రాజెక్టులు కార్యరూపందాల్చినట్లయితే 7వేల మంది స్థానిక యువతకు ఉద్యోగాలు లభించేవని గుర్తుచేశారు. ఇదిలా ఉంటే ఏపీ నుంచి నిష్క్రమిస్తున్న తాము తెలంగాణ, ఉత్తర్‌ప్రదేశ్, తమిళనాడు, కేరళలో తమ ప్రాజెక్టులు అనుకున్న సమయానికే పూర్తి చేస్తామని వెల్లడించారు.ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల విషయంలో చాలా సంస్థలు వెనక్కు తగ్గుతున్నాయి.ఇందుకు జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలే కారణమని సమాచారం.ఇది వరకే అమరావతి నిర్మాణంలో పాలుపంచుకునేది లేదంటూ సింగపూర్ స్పష్టం చేయగా తాజాగా యూఏఈ కి చెందిన లులూ గ్రూప్ సంస్థ ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టమని తేల్చి చెప్పింది.