న్యూ ఢిల్లీ : ప్రతిపక్షాల ఆందోళనలతో లోక్సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంకలకు ఎస్పీజీ భద్రతను ఉపసంహరించడంపై కాంగ్రెస్ ఎంపీలు లోక్సభలో ఆందోళనకు దిగారు. సభ మధ్య భాగంలోకి దూసుకెళ్లి నిరసన చేపట్టారు. దీంతో సభాపతి ఓం బిర్లా విపక్ష సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపటి నుంచి సభ్యులు ఇలా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం కాంగ్రెస్ లోక్సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌధురీ మాట్లా డారు.‘ గాంధీ కుటుంబసభ్యులు సామాన్య వ్యక్తులు కారు. అత్యవసరంగా వారికి ఎస్పీజీ భద్రతను ఎందుకు ఉపసంహ రించారు. కాంగ్రెస్ పార్టీ నేతలను ప్రజలకు దూరంగా ఉంచేందుకు ప్రభుత్వం భద్రత ఉపసంహరించింది. దీనిపై ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా సమాధానం చెప్పాల’ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ సభ్యులు నినాదాలు చేయడంతో హోం మంత్రి అమిత్ షా సభ నుంచి వెళ్లిపోయారు. అనంతరం కాంగ్రెస్ సభ్యులు కూడా అసహనం వ్యక్తం చేసి సభ నుంచి బయటకు వెళ్లారు.