బెంగళూరు : భారత ఐటీ రంగంలో వృద్ధి మందగించిందని, దీని వల్ల సుమారు 40 వేల మంది ఉద్యోగాలు కోల్పోవచ్చని ప్రముఖ ఐటీ రంగ నిపుణుడు టీవీ. మోహన్‌దాస్ పాయ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఐటీ కంపెనీలు 30 వేల నుంచి 40 వేల మంది వరకు మధ్యశ్రేణి ఉద్యోగులను తొలగించవచ్చని అభిప్రాయపడ్డారు. వృద్ధి నమోదు చేసినప్పుడు ప్రమోషన్లు సాధారణమేనని, వృద్ధి తగ్గుతున్నప్పుడు మాత్రం ఆ ప్రభావం ఎక్కువగా మధ్యశ్రేణి ఉద్యోగులపైనే పడుతుందని పేర్కొన్నారు. ఆ స్థాయి ఉద్యోగులను తొలగించడానికే కంపెనీలు మొగ్గుచూపుతుంటాయన్నారు. ప్రతి ఐదేళ్లకోసారి ఇలాంటి ప్రక్రియలు సాధారణమన్నారు. ఉద్యోగాలు కోల్పోయే వారిలో 80 శాతం మందికి ఇతర రంగాల్లో మళ్లీ ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు.