ఏళ్ల నుంచి ఎన్నో కష్టాలు,ఆటంకాలు దాటుకొని అనుకున్న లక్ష్యాన్నిచేరుకున్న ఓ యువతి ఆనందాన్ని కూతురు సాధించిన విజయాన్ని చూసి మురిసిపోయిన తల్లితండ్రుల సంతోషాన్ని ఒకేఒక్క దోమకాటు శాశ్వతంగా దూరం చేశాయి.కూతురుని బతికించుకోవాలన్న తాపత్రయంతో 10 రోజుల్లో రూ. 12 లక్షలు ఖర్చు చేసినా, ప్రాణాలు దక్కక పోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మెదక్ జిల్లా హవేళి ఘణపూర్ మండలానికి చెందిన భవ్యారెడ్డి (21) ప్రస్తుతం ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఆమె, క్యాంపస్ సెలక్షన్స్ లో ప్రతిభ చూపి ఇన్ఫోసిస్ లో ఉద్యోగాన్ని సంపాదించింది.పది రోజుల క్రితం ఆమెకు జ్వరం రావడంతో తల్లితండ్రులు నరేందర్ రెడ్డి, మంజల తొలుత స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు.పరిస్థితి విషమించడంతో, హైదరాబాద్ లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు.అక్కడ రక్త పరీక్షలు నిర్వహించగా భవ్యాకు డెంగీ సోకిందని వైద్యులు తేల్చారు. ప్లేట్ లెట్స్ సంఖ్య 40 వేలకు పడిపోయిందని చెప్పడంతో ఎంత ఖర్చయినా కుమార్తెను బతికించుకోవడం కోసం తల్లిదండ్రులు వెనుకాడలేదు. జ్వరం, బీపీ బాగా పెరిగిపోగా, వైద్యులు వెంటిలేటర్ అమర్చారు. రెండు రోజుల పాటు ప్రాణాలతో పోరాడిన భవ్య, కన్నుమూసింది.