భుబనేశ్వర్: ‘జాతిపిత మహాత్మగాంధీది హత్య కాదు. ప్రమాదం.’అని ఒడిశా రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ రూపొందించిన రెండు పుటలో సెలవిచ్చారు. దీనిపై తీవ్ర దుమారం చెలరేగడంతో సదరు పుస్తకాల్ని ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఇంకా పుస్తక రూపకర్తలపై విచారణకు ఆదేశించారు. వాస్తవానికి 1948, జనవరి 30న ప్రార్థన చేస్తున్న సమయంలో గాంధీని గాడ్సే తుపా కీతో కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఇంతటి ప్రపంచ సత్యాన్ని తప్పుదోవ పట్టించడానికే గాంధీ ప్రమాదంలో మరణించారని ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రజా సంఘాలు మండి పడుతున్నాయి. ‘ఆమా బాపూజీ: ఏక్ ఝలాకా’ అనే రెండు పేజీల పుస్తకాన్ని గాంధీజీ 150వ జయంతి సందర్భంగా రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ రూపొందించింది. ఇందులో గాంధీ మరనాన్ని హత్యగా కాకుండా ప్రమాదంగా వర్ణించడంతో దుమారం చెలరేగింది. ‘దీన్ని రూపొందించిన వారు ఎంతటి వారైనా సరే కఠిన చర్యలు తీసుకుంటాం. గాంధీ హత్యకు ఎలా గురయ్యారో వివరించి చెప్పడానికి బదులు, దీనిని ప్రమాదంగా వర్ణించడమేంటి? వెంటనే ఆ పుస్తకాన్ని వెనక్కి తీసుకుంటున్నాం. రూపకర్తలపై విచారణకు ఆదేశించాం’’ అని విద్యాశాఖ మంత్రి సంజాయిషీ ఇచ్చారు. ‘‘గాంధీని గాడ్సే అనే మూర్ఖుడు హత మార్చాడు. కానీ దీనిని ప్రమాదంగా చిత్రించడం దేశ యువతను తప్పుదారి పట్టించే ప్రయత్నం. ఆధారాలు మన కళ్ల ముందే ఉన్నా అబద్ధాల్ని ప్రచారం చేస్తున్నారు. మనం గాంధీజీ 150వ జయంతిని జరుపుకుంటున్నాం. దేశం ఆయనకు ఘన నివాళి అర్పించాల్సిన సమయంలో అవమానాల పాలు చేస్తున్నాం’’ అని సామాజిక కార్యకర్త సమాంతర ఆవేదన చెందారు.