బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన గుర్తుందా? 1992లో దేశ నలుమూలల నుంచి అయోధ్యకు కరసేవకులు బయలుదేరారు. అయోధ్యకు వెళ్లి మసీదును కూల్చేశారు. అప్పట్లో అయోధ్యకు బయల్దేరిన తొలి కరసేవకుల బృందంలో ఉన్న ప్రస్తుత కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కూడా ఒకరు.అయోధ్య కేసుపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తరువాత తాను కరసేవకుడిగా, బాబ్రీ మసీదు ముందు కూర్చుని తీయించుకున్న చిత్రాన్ని సోషల్ మీడియాలో పంచుకున్న బండి సంజయ్, నాటి అనుభవాలను నెమరువేసుకున్నారు. కరీంనగర్ నుంచే మొట్ట మొదటి కరసేవకుల బృందం అయోధ్యకు వెళ్లిందని, అప్పట్లో ప్రధానిగా పీవీ నరసింహారావు ఉండటం, ఆయన సొంత జిల్లా కరీంనగర్ కావడంతో, ఈ ప్రాంతం నుంచే తొలి బృందం బయలుదేరాలని పార్టీ నిర్దేశించడంతో, 15 మందిమి వెళ్లామని అన్నారు. తొలి నాలుగురోజులు టీ తాగుతూ, బిస్కెట్లు తింటూ గడిపామని, ఆపై ఇతర ప్రాంతాల నుంచి కరసేవకులు తరలివచ్చిన తరువాత భోజన ఏర్పాట్లు చేశారని చెప్పారు.