ఢిల్లీ : ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్‌లో స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (వీఆర్ఎస్) ప్రారంభమైంది. 70 నుంచి 80 వేలమంది ఈ పథకాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది. దీని ద్వారా రూ.7 వేల కోట్ల మేర జీత భత్యాల వ్యయ భారం తగ్గే అవకాశం ఉందని బీఎస్ఎన్ఎల్ భావిస్తోంది. నవంబర్ 4 నుంచి డిసెంబర్ 3 వరకు వీఆర్ఎస్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని బీఎస్ఎన్ఎల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పీకే పుర్వార్ తెలిపారు. ఇప్పటికే వీఆర్ఎస్‌కు సంబంధించిన సమాచారాన్ని ఉద్యోగులకు తెలిపినట్లు చెప్పారు. మొత్తం 1.50 లక్షల మంది ఉద్యోగుల్లో సుమారు లక్ష మంది వీఆర్ఎస్‌కు అర్హులని, వీరిలో 70 నుంచి 80 వేల మంది బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకునే అవకాశం ఉందని పుర్వార్ తెలిపారు. బీఎస్ఎన్ఎల్‌లో పనిచేస్తున్న 50 ఏళ్లు పైబడిన శాశ్వత ఉద్యోగులు ‘బీఎస్ఎన్ఎల్ వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్-2019’కు అర్హులు. ఇప్పటి వరకు పూర్తి చేసుకున్న సర్వీసుకు గానూ ఏడాదికి 35 రోజుల చొప్పున వేతనాన్ని, రిటైర్మెంట్ వయసుకు మిగిలి ఉన్న ఏళ్లకు గానూ 25 రోజుల వేతనాన్ని వీఆర్ఎస్‌కు దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులకు ఎక్స్‌గ్రేషియా కింద అందించనున్నారు. బీఎస్ఎన్ఎల్-ఎంటీఎన్ఎల్‌లను విలీనం చేస్తూ గత నెల కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో నష్టాల్లో ఉన్న రెండు కంపెనీలకు గానూ పునరుద్ధరణ ప్యాకేజీ కింద రూ.69 వేల కోట్లు ప్రకటించింది. అంతేగాక రెండేళ్లలో ఉమ్మడి సంస్థను లాభాల్లోకి తెచ్చేందుకు గానూ ఆస్తుల మానిటైజింగ్‌తో పాటు ఉద్యోగులకు వీఆర్ఎస్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ రెండు కంపెనీలు ప్రస్తుతం రూ.40 వేల కోట్ల అప్పుల్లో ఉన్నాయి.