గుంటూరు జిల్లాలో మీ సేవలు నిలిచి పోయాయి. తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ మీ సేవ ఆపరేటర్లు ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించినా పట్టించుకోకపోవడంతో వారంతా గురువారం సమ్మె బాటపట్టారు. దీంతో ఉన్నత స్థాయి అధికారులు వారితో చర్చలు జరిపారు. ఈ చర్చలు రాత్రి వరకు సఫలం కాలేదు. దీంతో సమ్మె యథావిధిగా కొనసాగే అవకాశం కనిపిస్తోంది. జిల్లాలో మొత్తం 540 మీ సేవా కేంద్రాలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతంలో 440 కేంద్రాలు ఏపీ ఆన్లైన్ ప్రాంచైజీ పరిధిలో, పట్టణ ప్రాంతంలో 110 కేంద్రాలు కార్వే ప్రాంచైజీ ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయి. సమ్మెతో జిల్లా వ్యాప్తంగా సామాన్య ప్రజలతో పాటు, విద్యార్థులు, రైతులూ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వీరందరికీ ప్రభుత్వపరంగా అందాల్సిన సేవలు నిలిచి పోయాయి. మీ సేవా కేంద్రాల ద్వారా ప్రస్తుతం 39 ప్రభు త్వ శాఖలకు సంబంధించి 366 రకాల సేవలు అందుతున్నాయి. విద్యార్థులకు సంబంధించిన కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో పాటు, రైతులకు అవసరమైన అన్ని రకాల సేవలు ఈ కేంద్రాల నుంచే పొందవచ్చు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండానే ప్రభుత్వ సేవలు పొందేందుకు వీటిని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వ్యవసాయ, రెవెన్యూ, విద్య, సంక్షేమ, పోలీస్, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, పౌరసరఫరాలు, పురపాలక, రవాణా, గనులు తదితర ప్రధాన శాఖలతో పాటు ఇతర ప్రభుత్వ శాఖలకు సంబంధించి వీటి ద్వారానే సేవలు అందిస్తున్నారు. మీ సేవల ద్వారా సేవలు పొందేందుకు నిర్ణీత రుసుంను ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. కేటగిరి ఏ, బీ కింద కొన్ని సర్వీసులను విభజించి రూ. 35, రూ. 45 వసూలుకు అనుమతి ఇచ్చింది. ఈ సేవా రుసుము నుంచి ప్రభుత్వం 12-15 శాతం సొమ్మును మళ్లీ ఆయా కేంద్రాల ఆపరేటర్లకు కమీషన్ కింద ఇస్తుంది. ఈ విధానం కొన్నేళ్ల నుంచి అమలవుతోంది. అయితే కేంద్రాల సంఖ్య పెరగడంతో ఎక్కడికక్కడ దరఖాస్తుల సంఖ్య తగ్గిందని తమకు గిట్టుబాటు కావడం లేదని ఆపరేటర్లు అంటున్నారు. దీనికి తోడు జీఎస్టీ 18 శాతం కట్టాల్సి వస్తోందని, ఈ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. తమకు ఇచ్చే కమీషన్ను పెంచాలని, దానికి జీఎస్టీ నుండి మినహాయింపు ఇవ్వాలని అడుగుతున్నారు. ప్రభుత్వమే ఆపరేటర్లకు భృతి ఇవ్వాలని విన్నవిస్తున్నారు. వారి డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో చివరగా గురువారం వరకు గడువు ఇచ్చారు. అయినా ప్రభుత్వం దిగి రాకపోవడంతో సమ్మె చేపట్టారు.