ముంబై: ‘కశ్మీర్లో అన్నీ సక్రమంగా ఉంటే బయటి వ్యక్తులను అక్కడకు ఎందుకు పంపార’ని శివసేన పత్రిక –సామ్నా కేంద్ర ప్రభుత్వాన్ని బుధవారం ప్రశ్నించింది. ‘కశ్మీర్లో నెలకొన్న పరిస్థితుల సమీక్షకు 27 మందితో కూడిన ఐరోపా ప్రతినిధుల బృందం పర్యటిస్తోంది. కశ్మీర్ అంశం మన దేశ అంతర్గత వ్యవహారమైనప్పుడు ఇక్కడ వారికేం పని?. మన దేశ జెండా ఇప్పుడు కశ్మీర్లో ఎగురుతోంది. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాల పట్ల గర్విస్తున్నాం. కశ్మీర్లో అన్నీ సక్రమంగా ఉంటే బయటి వ్యక్తులను అక్కడకు ఎందుకు పంపారు?. కశ్మీర్ మన అంతర్గత వ్యవహారం కాదనా?. మీ ప్రభుత్వ నిర్ణయాల్లో ఐరాస తలదూర్చకూడదు. ఇలా బయటి వ్యక్తులు మాత్రం కశ్మీర్లో సంచరించవచ్చా? విదేశీ వ్యక్తులు ఇలా అక్కడ పర్యటిస్తే ఎంతో మంది ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతారు. అంతే కాకుండా కశ్మీరీల స్వేచ్ఛకు అది భంగం కలిగించినట్లు కాదా? ఏ ఉద్దేశం లేకుండానే వారు కశ్మీర్లో పర్యటిస్తున్నారా..? ఈ విషయంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమాధానం చెప్పి తీరాలి’ అని సంపాదకీయంలో ప్రశ్నల వర్షాన్ని కురిపించింది.