గన్నవరం : యువతను ప్రయోజకులుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్రంలో 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లిలో నూతనంగా నిర్మించిన సీపెట్ (సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ) భవనాలను కేంద్ర మంత్రి సదానంద గౌడతో సీఎం ప్రారంభించారు. సీపెట్ శిలాఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో స్థానికులకే 75 శాతం ఉద్యోగ అవకాశాలు ఇచ్చేలా చట్టం చేశామన్నారు. మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలనే దీన్ని తీసుకొచ్చామని తెలిపారు. ప్లాస్టిక్ ఇంజినీరింగ్లో శిక్షణ పొందిన వారికి మంచి అవకాశాలున్నాయని వెల్లడించారు. ఇలాంటి సంస్థలను ప్రతి శాసన సభ నియోజకవర్గంలో ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. 25 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి సదానంద గౌడ మాట్లాడుతూ నెల్లూరు జిల్లా నాయుడుపేటలో మరో సీపెట్ సంస్థను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.