ఢిల్లీ : ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్‌లో శాంతి భద్రతల పరిరక్షణ కోసం ముందస్తు నిర్బంధంలో ఉంచిన ముగ్గురు మాజీ ముఖ్యమంత్రుల విడుదల తన చేతుల్లో లేదని హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. గృహ నిర్బంధంలో ఉంచిన మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ విడుదలపై నిర్ణయాన్ని సైన్యం, పోలీసులు మాత్రమే తీసుకోగలుగుతారని అన్నారు. బుధవారం ఆయన ఓ జాతీయ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. కశ్మీర్‌లో పూర్తిగా సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. ప్రస్తుతం సున్నితమైన ఆరు పోలీస్ స్టేషన్ల పరిధిలో మాత్రమే కర్ఫ్యూ, 144 సెక్షన్ విధించారని వివరించారు. పాక్ నుంచి ముప్పు ఇంకా పొంచి ఉన్నందున భద్రతా దళాలు, ప్రభుత్వం నిరంతరం అప్రమత్తంగా ఉన్నాయని చెప్పారు.