కోల్‌కతా : భారత బ్యాంకింగ్ వ్యవస్థ తీవ్రమైన సంక్షోభ పరిస్థితులను ఎదుర్కోబోతుందని ఆర్థికవేత్త, నోబెల్ పురస్కార గ్రహీత అభిజిత్ బెనర్జీ హెచ్చరించారు. తక్షణం బ్యాంకింగ్ రంగానికి ఉద్దీపన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని, దీనిపై ఆర్‌బీఐ కూడా అంత అప్రమత్తంగా లేదని వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన ఓ జాతీయ వార్తా సంస్థతో మాట్లాడారు. పీఎంసీ బ్యాంకు కుంభకోణం గురించి ప్రస్తావిస్తూ, భవిష్యత్తులో బ్యాంకింగ్ రంగం ఎదుర్కోనున్న సమస్యలపై ఆయన మాట్లాడారు. ‘ప్రస్తుతం బ్యాంకింగ్ రంగం సమస్యలను ఎదుర్కొంటోంది. చాలా కాలంగా గందరగోళ విధానాలు అవలంబించడం వల్ల ఈ పరిస్థితి వచ్చి ఉంటుందని భావిస్తున్నాను. బ్యాంకులకు సరిపడా మూల ధనాన్ని సమకూర్చాల్సి ఉంది. కానీ బ్యాంకింగ్ రంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం వద్ద అంత డబ్బు లేదు. సంక్షోభానికి ప్రభావితమైన బ్యాంకుల అమ్మకానికి కూడా ఈ పరిస్థితి దారి తీయవచ్చు. అనేక బ్యాంకులు ఆర్థిక సంక్షోభానికి ప్రభావితమవుతున్నాయి. ఈ సమస్య ఇంకా తీవ్రంగా ఉంటుంది. రాను రాను మరిన్ని బ్యాంకుల నుంచి సమస్యలు బయట పడతాయి.’ అని అన్నారు. ఈ పరిస్థితుల్లో తీవ్ర ప్రభావిత బ్యాంకులను విక్రయించి తద్వారా నిధులు సమకూర్చి, మిగతా బ్యాంకులకు ఉద్దీపన కల్గించవచ్చని ఆయన విశ్లేషించారు.