ప్రజా శాంతి పార్టీ పేరుతో కిలారి ఆనంద్ పాల్ అలియాస్ కేఏ పాల్, పబ్లిసిటీ స్టంట్లు షురూ చేశాడు. గతంలోనే ఈ పాల్, ప్రజాశాంతి పార్టీ పెట్టాడు. ప్రజాశాంతి పార్టీనా.? అదెక్కడుంది.? అనడక్కండి. అదంతే. వైఎస్ జగన్ అవినీతి పరుడట.. చంద్రబాబు రాష్ట్రాన్ని నిలువునా దోచేసుకున్నాడట. ఆంధ్రప్రదేశ్‌లో తనకు ఆల్రెడీ 70 సీట్లు ఖాయమైపోయానీ, ఎన్నికల కంటే ముందు తాను గెలిచేసినట్లేననీ కేఏ పాల్ కామెడీ చేస్తోంటే, అక్కడికి తామేదో న్యూస్ ఛానల్లో మాంఛి కామెడీ స్కిట్ చూసినట్లుగా బుల్లితెర వీక్షకులు కడుపుబ్బా నవ్వేసుకుంటున్నారు. నవ్వరా మరి, ఈయనగార్ని ఎక్కడో విదేశాల్లో చూసిన జనం ‘మీ వయసు 28 ఏళ్ళే కదా.?’ అనడిగారంటే నవ్వు రాకుండా ఎలా వుంటుంది.? న్యూస్ ఛానల్ చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ కేఏ పాల్ చేసిన కామెడీలు అన్నీ ఇన్నీ కావు. పాపం ఓ యాంకర్, పాల్ కామెడీకి బలైపోయింది. వున్న పళంగా బ్రేక్ ఇచ్చేసింది, ఆయనగారి కామెడీని తట్టుకోలేక. ‘నీ వయసు 39 ఏళ్ళు కదా..’ అనేశాడయన మరి. దాంతో ఒక్కసారిగా ఆ యాంకర్‌కి మైండ్ బ్లాంక్ అయిపోయింది. వెంటనే పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంది.. చివరికి బ్రేక్ ఇవ్వక తప్పలేదామెకి. అమితాబ్ బచ్చన్ కోమాలోకి వెళితే, తానే ప్రార్ధనలు చేసి ఆయన్ని బతికించేశానంటాడు కేఏ పాల్. ట్రంప్‌ని గెలిపించింది తానేనని పాల్ చెప్పుకుంటుంటాడు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు తన ప్రార్థనల కోసం ‘క్యూ’ లైన్లలో నిల్చుని పడిగాపులు కాస్తుంటారనీ పాల్ చెప్పేస్తుంటాడు. అదే ఆయన ప్రత్యేకత. ఒకప్పుడు పాల్ పేరు మార్మోగిపోయిన మాట వాస్తవం. క్రైస్తవ మత ప్రబోధకుడిగా అతి తక్కువ కాలంలోనే బోల్డంత పేరు ప్రఖ్యాతులైతే దక్కించుకున్నాడుగానీ, ఆ తర్వాతే పాల్ జీవితం కామెడీగా తయారైంది. ఆ కామెడీనే ఇప్పుడాయన కొనసాగిస్తున్నారు. రాజకీయాలంటే పాల్కి మరీ కామెడీ. ఒకప్పుడు ఆయన్ని ‘క్రైస్తవ మత ప్రబోధకుడిగా’ క్రైస్తవ ఓటు బ్యాంకు కోసం వివిధ రాజకీయ పార్టీలు అక్కున చేర్చుకున్నాయి.. దాన్ని పట్టుకుని ఇప్పుడు కామెడీ చేస్తే ఎలా.? కేరళ, తమిళనాడు, కర్నాటక, తెలంగాణ, ఒరిస్సాలో పాల్ గారి ప్రజాశాంతి పార్టీకి ఏకంగా 20 శాతం ఓటు బ్యాంకు వుందట. ఇంతకన్నా పెద్ద కామెడీ ఇంకేముంటుంది.? సొంత డబ్బా కొట్టుకోవడంలో మనకు తెలిసి చంద్రబాబుని మించినోళ్ళు ఎవరూ లేరు ఇప్పటిదాకా. ఆ ఘనతను చంద్రబాబు నుంచి లాగేసుకోగల సత్తా ఒక్క పాల్కి మాత్రమే వుందండోయ్.