హైదరాబాద్ : రాష్ట్రంలో ప్లాస్టిక్‌ను నిషేధిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు కార్యక్రమంపై మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ప్రగతిభవన్‌లో సీఎం సమీక్ష నిర్వహించారు. పర్యావరణంపై చర్చ సందర్భంగా మానవాళికి, జీవకోటికి ముప్పుగా మారుతున్న ప్లాస్టిక్‌ను నిషేధించాలని నిర్ణయించారు. దీనిపై విధివిధానాలు ఖరారు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. మంత్రి వర్గ సమావేశంలో ప్లాస్టిక్ నిషేధంపై సమగ్రంగా చర్చించి ఉత్తర్వులు జారీ చేస్తామని వెల్లడించారు. పారిశుధ్యం నిర్వహణలో కేంద్రం నుంచి అవార్డులు అందుకున్న జిల్లా కలెక్టర్లను ఆయన అభినందించారు. పెద్దపల్లి కలెక్టర్ దేవసేన, సంగారెడ్డి కలెక్టర్ హన్మంతరావు, భూపాలపల్లి కలెక్టర్ వెంకటేశ్వర్లుకు అభినందనలు తెలిపారు.