అమరావతి: ఎలక్షన్ మిషన్ 2019పై ఏపీ సీఎం చంద్రబాబు గురువారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ ముఖ్యనేతలు, ప్రజా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడాన్ని ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు చూసి.. విపక్ష నేతలకు కంటగింపు కలుగుతోందని విమర్శించారు. రాయలసీమ, ఉత్తరాంధ్రలో పారిశ్రామిక ప్రగతి చూసి అసూయపడుతున్నారని అన్నారు. ప్రాంతాల మధ్య చిచ్చు రగిలించాలని కుట్రలు పన్నుతున్నారని, రాయలసీమ, ఉత్తరాంధ్రలో చిచ్చుపెట్టాలని చూశారని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రాన్ని మోసం చేసే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన నేతలను హెచ్చరించారు. జగన్తో కేటీఆర్ హడావుడిగా భేటీ అయ్యారని, బీజేపీ వ్యతిరేక శక్తులు ఏకం కాకుండా కుతంత్రాలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. రాజకీయ స్వలాభం కోసం విపక్షాలు ఎంతకైనా సిద్ధపడుతున్నాయని ఆయన ధ్వజమెత్తారు.