పొత్తుల ముచ్చటే రాలేదు

హైదరాబాద్‌: ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ భేటీలో పొత్తుల ప్రస్తావనే రాలేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్ని అవమానాలైనా భరిస్తామని.. ఎంత దూరమైనా వెళ్తామని తమ పార్టీ అధ్యక్షుడు ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. గురువారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌-కేటీఆర్‌ భేటీపై టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నిన్నటి (బుధవారం) భేటీలో ఫెడరల్‌ ఫ్రంట్‌ గురించి మాత్రమే చర్చించారని, పొత్తుల గురించి కాదని స్పష్టం చేశారు. ఏపీకి తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్యాయం చేస్తే తెలంగాణ ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్‌తో పొత్తు కోసం టీడీపీ ఎందుకు ప్రయత్నించిందని ప్రశ్నించారు.

ఒడిషా, కర్ణాటక, పశ్చిమబెంగాల్‌ సీఎంలను ఫెడరల్‌ ఫ్రంట్‌ కోసం కేసీఆర్‌ కలిశారని, ఈ నేపథ్యంలోనే వైఎస్‌ జగన్‌ను టీఆర్‌ఎస్‌ నేతలు కలిశారని ఆయన పేర్కొన్నారు. దీనిపై టీడీపీ నేతలు ప్రజల్లో అపోహలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారని మండిపడ్డారు. 2019 ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని గతంలోనే తమ అధ్యక్షుడు ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.  పదేళ్లు హైదరాబాద్‌లో రాజధాని కొనసాగే అవకాశం ఉన్నా ఎందుకు ముందుగానే వచ్చారని ప్రశ్నించారు. టీడీపీ నేతల వక్రబుద్ధిని రాష్ట్ర ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో పోలీసు వ్యవస్థను భ్రష్టపట్టిస్తున్నారని, శాంతి భద్రతలపై నమ్మకం లేకుండా చేశారని టీడీపీ నేతలపై ధ్వజమెత్తారు. టీడీపీ నేతల మాటలకు ఊసరవెల్లి కూడా సిగ్గుపడేలా ఉందని బొత్స సత్యనారాయణ ఎద్దేవ చేశారు. 
 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos