ముంబై: దేశంలోని మూక దాడుల పై ఆందోళన వ్యక్తం చేసి, ప్రధాని మోదీకి లేఖ రాసిన వారికి వ్యతిరేకంగా దేశ ద్రోహ నేరారోపణ చేయటాన్ని మరో 180 మంది ప్రముఖులు తీవ్రంగా ఆక్షేపించారు. ఈ మేరకు విడుదల చేసిన బహిరంగ లేఖపై ప్రముఖ చరిత్రకారులు రోమిలా థాపర్, బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా, నృత్యకారిణి మల్లికా సారాభాయ్, గాయకుడు టి.ఎం.కృష్ణ వివిధ రంగాల ప్రముఖులు ఉన్నారు. సమస్యలపై స్పందించి ప్రధానికి లేఖ రాయడం దేశద్రోహ చర్య ఎలా అవుతుందని ప్రశ్నించారు. సమాజంలో బాధ్యత గల పౌరులుగా వారు తమ విధిని నిర్వర్తించారన్నారు. కేసుల పేరిట ప్రజల గొంతు నొక్కడం వారి హక్కులను హరించడం కాదాని ప్రశ్నించారు. 49 మంది రాసిన లేఖలోని ప్రతి అక్షరాన్నీ తాము సమర్థిస్తు న్నామన్నారు. ప్రజా గొంతుకను నొక్కేయడం పైనా,మూక దాడులకు వ్యతిరేకంగా ప్రతిరోజు బహిరంగంగా మాట్లాడతామని హెచ్చరించారు. మూక దాడులపై ఆందోళన వ్యక్తం చేసి చరిత్రకారుడు రామచంద్ర గుహ, దర్శకుడు మణిరత్నం, అపర్ణ సేన్ సహా వివిధ రంగాల ప్రముఖులు ప్రధాని మోదీకి లేఖ రాసినందుకు అభ్యంతరం తెలిపిన న్యాయవాది సుధీర్ కుమార్ ఓజా వారికి వ్యతిరేకంగా న్యాయస్థానానికి ఫిర్యాదు చేసారు.