హైదరాబాద్: ఆర్టిసి కార్మికుల సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధ కాండకు దిగింది. పోరాటానికి నాయకత్వం వహించిన సంయుక్త కార్యచరణ సమితి నేతలను మంగళవారం అరెస్టు చేసింది. నిరాహార దీక్ష చేయడానికీ వారికి అనుమతివ్వ లేదు. గతంలో ప్రకటించినట్లు ధర్నా చౌక్ (ఇందిరా పార్కు) వద్ద సోమ వారం ఆర్టిసి కార్మికులు సామూహిక నిరాహార దీక్ష చేయాల్సి ఉంది. ఇందుకు పోలీసులు అనుమతివ్వ లేదు. పెద్ద సంఖ్యలో ధర్నా చౌక్ వద్ద మొహరించారు. దీక్షకు వచ్చిన కార్మికుల్ని అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. దీంతో దీక్షను వాయిదా వేసారు. తర్వాత గన్ పార్కు వద్ద ఉన్న అమరవీరుల స్థూపానికి నివాళులర్పించేందుకు జెఎసి నేతలు వెళ్లారు. ‘నివాళులర్పించడానికీ అనుమతి లేదు’ అని పోలీసులు అడ్డుకున్నారు. చేతిలో ఉన్న పూలమాలలను స్తూపం వద్ద పెట్టి వెడతామని నాయకులు చెప్పినా వినిపించుకోకుండా అడ్డుకుని అరెస్ట్ చేశారు. వారి మధ్య కొద్ది సేపు వాగ్వివాదం జరిగింది. ఉద్రిక్త పరిస్థితుల నడుమ నాయకులను అక్కడినుంచి తరలించారు. ప్రస్తుతం సంచరిస్తున్న 10,400 బస్సుల్లో సగం అంటే 5200 బస్సులు ఆర్టీసికి చెందినవి. మరో 3200 బస్సులను అద్దె ప్రాతిపదికన నడుపుతామని చెప్పారు. 2100 బస్సులు పూర్తిగా ప్రైవేటువి . ప్రైవేటు వారికి స్టేజి క్యారేజికి కూడా అనుమతులించి ఆర్టిసి, ప్రైవేటు బస్సుల్లోనూ ఒకే మాదిరి ఛార్జీలు వసూలు చేసేలా చూస్తామని చెప్పారు.
పొలం కూలీలం కాం : జెఎసి
ముఖ్యమంత్రి బెదిరింపులకు భయపడేందుకు తాము ఆయన పొలం కూలీలు కామని జెఎసి ప్రకటించింది. జెఎసి నేత అశ్వత్థామరెడ్డి విలేకరులతో మాట్లాడారు. ‘కార్మికులను తొలగిస్తామనడం సిఎం అహంకారానికి నిదర్శనం. తొలగిస్తే కోర్టులో తేల్చుకుంటాం. కార్మికులందరూ ఆ ఉత్తర్వుల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు ఆర్టిసిని కాపాడుకోవడానికే ఆందోళన చేశాం. ఇకనుంచి ప్రజాస్వామ్య పరిరక్షణకు ఉద్యమిస్తామన్నారు.
‘మెగా’ కోసమేనా?
కొత్తగా రవాణా పరిశ్రమలోకి అడుగుపెట్టిన మెగా సంస్థ కోసమే రాష్ట్ర ప్రభు త్వం ప్రైవేటు జపం చేస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ సంస్థతో ఒప్పందం చేసుకునేందుకు తెర వెనుక ప్రయత్నాలు జరుగుతు న్నాయని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు.