నాగపూర్: మూక దాడులు గర్హనీయమని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధినేత చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. ఇక్కడి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కచ్చేరీలో మంగళ జరిగిన విజయ దశమి వేడుకల్లో ప్రసంగించారు. ‘భారత దేశం భారతీయులందరిదీ. ఇక్కడ అందరూ కలిసి మెలిసి సహజీవనం సాగిస్తుంటారు. భిన్నత్వం అనేది మన దేశానికి అంతర్గత శక్తి. మూకదాడులు వంటి కొన్ని సామాజిక హింసా ఘటనల వల్ల దేశానికి, హిందూ సమాజం ప్రతిష్టకు భంగం వాటిల్లుతోంది. కొన్ని మతాల మధ్య భయాందోళనలకు దారితీస్తుంది. మూకదాడులు భారత సంస్కృతి కాదు, పరాయి సంస్కృతి. కులం, మతం, భాష, ప్రాంతాల వైవిధ్యాన్ని స్వప్రయోజనాలకు వాడుకోవడం వల్ల విభేదాలకు తావిస్తుంది. అలాంటి స్వార్థ శక్తుల కుట్రలను గుర్తించి అప్రమతం కావాలి. తిప్పికొట్టాలి. భిన్నాభిప్రాయాలు కావచ్చు, రెచ్చగొట్టే ప్రయత్నాలు కావచ్చు. ఎవరే చర్యకు పాల్పడినా అది రాజ్యాంగ పరిధిలోనే ఉండాలన్న విషయాన్ని సమాజం గుర్తెరగాలి. సమాజంలోని భిన్న వర్గాలు పరస్పర సౌహార్ద్రం, చర్చలు, సహకారం కోసం పాటుపడాలన్నారు. ఇవాల్టి సమాజానికి ఇవి అనివార్యమని సూచించారు. పరస్పర సహకారం, కలిసి చర్చించుకునే వాతావరణాన్ని పాదు కొలి పేందుకు సంఘ్ స్వయంసేవక్లు కృషి చేయాల’ని పిలుపు నిచ్చారు.