విశాఖపట్నం : రెండు దశాబ్దాలుగా రాష్ట్రంలో స్వయంశక్తి సంఘాలు అనేక రకాల ఉత్పత్తులు తయారు చేస్తున్నాయి. పచ్చళ్లు, అప్పడాలు, పొడులు, వడియాల నుంచి చిరుధాన్యాల పిండిలు, తినుబండారాలు, అలంకరణ వస్తువులు, చీరలు, డ్రెస్‌లు, జాడీలు, కుండలు… ఇలా చాలా ఐటమ్స్ ఈ జాబితాలో ఉన్నాయి. వీటిని విక్రయించుకునేందుకు ప్రభుత్వం ఏటా డ్వాక్రా బజార్లు నిర్వహిస్తోంది. అయితే ఈ బజార్‌లు వారం, పది రోజులే ఉంటాయి. మిగిలిన సమయాల్లో కొనుగోలుదారులు, స్వయంశక్తి సంఘాల మధ్య అనుసంధానం ఉండదు. ఈ నేపథ్యంలో స్వయంశక్తి సంఘాల ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్త మార్కెట్ కల్పించాలనే ఉద్దేశంతో ఆన్‌లైన్ అమ్మకాలకు ‘సెర్ప్’ (సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ) ఆలోచన చేసింది. హైదరాబాద్‌కు చెందిన కల్గుడి సంస్థ సహకారంతో ‘ఈ మహిళ’ పోర్టల్‌ను రూపొందించారు. ఇప్పటివరకు 200లకుపైగా స్వయంశక్తి సంఘాలు ఈ పోర్టల్ ద్వారా వస్తువులను విక్రయిస్తున్నాయి. భవిష్యత్‌లో 2లక్షల సంఘాలను ఈ పోర్టల్‌లోకి తీసుకురావాలనే లక్ష్యంగా సెర్ప్ పనిచేస్తోంది. విశాఖలో నిర్వహించిన డ్వాక్రా బజార్‌లో ప్రత్యేక స్టాల్ ఏర్పాటుచేసి స్వయంశక్తి బృందాలకు ఆన్‌లైన్‌లో వస్తు విక్రయాలపై అవగాహన కల్పించారు. పక్కాగా ప్యాకింగ్‌ప్రస్తుతం ఆన్‌లైన్ మార్కెట్‌లో అనుసరిస్తున్న విధంగానే ‘ఈ మహిళ’ పోర్టల్‌లో వస్తువుల వివరాలు అప్‌లోడ్ చేస్తున్నారు. ధర ఒక్కటే కాకుండా ఆ వస్తు వు తయారీకి వినియోగించే మెటీరియల్, తయారుచేసిన సంఘం వివరాలు వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ‘ఈ మహిళ’ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని తమకు నచ్చిన వస్తువులను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో ఎంపిక చేసుకున్న వస్తువు సమాచారం ఉత్పత్తిదారుడికి అందుతుంది. సంబంధిత సంఘం నుంచి ఆ వస్తువు గుంటూరు జిల్లా తాడేపల్లిలో ప్రధాన కార్యాలయానికి చేరుతుంది. అక్కడ పక్కాగా ప్యాక్ చేసి కొరియర్ ద్వారా వినియోగదారుడికి చేరవేస్తారు. వినియోగదారుడు చెల్లించే మొత్తం సంబంధిత ఉత్పత్తిదారుని బ్యాంకు అకౌంట్‌కు జమ అవుతుంది. నాణ్యతపై అవగాహనప్రస్తుతం ఎక్కువగా చెక్కబొమ్మలు, పచ్చళ్లు, వివిధ రకాల కారం పొడులు, పూతరేకులు, కాజాలు, ఆయుర్వేద ఉత్పత్తులు, దుస్తుల ఆర్డర్లు వస్తున్నాయి. కల్గుడి సంస్థ ఇప్పటికే దేశంలో 15 లక్షల మంది రైతులతో కలిసి పనిచేస్తోంది. ప్రస్తుతం స్వయంశక్తి సంఘాలు తయారుచేసిన ఉత్పత్తుల ఫొటోలు తీసి ‘ఈ మహిళ’ పోర్టల్‌కు అప్‌లోడ్ చేస్తోంది. భవిష్యత్తులో ‘ఈ పోర్టల్’ ద్వారా వ్యాపారాన్ని భారీగా విస్తరించనున్నట్టు కల్గుడి డైరెక్టర్ శ్రీనివాసచక్రవర్తి తెలిపారు. నాణ్యత, ప్యాకింగ్‌పై మహిళా సంఘాలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. గత నెల ఒకటో తేదీన పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సెర్ప్ ప్రతినిధి ఏలూరు రాము తెలిపారు.