కొద్ది రోజుల క్రితం కచ్చులూరు వద్ద గోదావరి నదిలో మునిగిపోయిన బోటును వెలికితీయడానికి అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే 35 మృతదేహాలు వెలికితీయగా మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.మిగిలిన ప్రయాణీకులు బోటులోనే చిక్కుకొని ఉంటారని భావించి బోటును వెలికితీయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు.అయితే బాగా లోతులో ఉండడం బురద,నీటి ఉధృతి వల్ల బోటును వెలికితీయడం కష్టతరమని కొద్ది రోజులు ఆగాలని ఉత్తరాఖండ్ నుండి వచ్చిన నిపుణుల బృందం తేల్చి చెప్పింది. అయితే అధికారులు మాత్రం బోటు బయటికి తీయడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ తరుణంలో పశ్చిమగోదావరి జిల్లా పశివేదలకు చెందిన వెంకట శివ అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.బోటు బయటకు తీయడం అధికారులకు, మంత్రులకు ఇష్టం లేదని వెంకటశివ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రమాదం జరిగిన రెండో రోజు తాను బోటు జాడను గుర్తించానని , బయటకు తీయడానికి సహకారం కావాలని అడిగానని చెప్పారు.అవకాశం ఇస్తే కేవలం రెండు గంటల్లో బోటు వెలికితీస్తానని గతంలో కూడా నీటిలో మునిగిన లాంచీలు,బోటులను వెలికితీసిన అనుభవం ఉందన్నారు. ఆ అనుభవంతోనే తనను పిలిచారని, ప్రమాదం జరిగిన రెండో రోజే మునిగిన బోటును గుర్తించి లంగరు వేశానన్నారు. అయితే తనకు రన్నింగ్ పంటు, ఐరన్ రోప్ కావాలని అడిగానని చెప్పారు.తనకు కావలసినవి ఇస్తే రెండు గంటల్లో బోట్ ను బయటకు తెస్తానన్నారు.తాడు సహాయంతో నది మధ్యలోకి వెళ్లి బోటుకు లంగరు వేసి బయటకు తీసుకురావడానికి తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. అయితే ఈ విషయాన్ని అధికారులు మంత్రుల దృష్టికి తీసుకెళితే పట్టించుకోలేదని ఆరోపించారు. బోటు ను గుర్తించడానికి ఉత్తరాఖండ్ నుండి నిపుణుల బృందం అవసరమే లేదని ఉత్తరాఖండ్ నిపుణుల బృందం ఇచ్చిన కెమెరాలు పనిచేయడం లేదని చెప్పిన శివ, ఇప్పటికైనా తనకు అవకాశమిస్తే బోట్ ను బయటకు తెస్తానని స్పష్టం చేశారు. అంతేకాదు రెండు గంటల్లోనే బోట్ ను బయటకు తీసుకువచ్చి తానేంటో నిరూపించుకుంటా అని సవాల్ విసిరారు.పర్యాటకశాఖ అధికారులు, మంత్రులు, బోటు యజమానులు అందరూ కలిసి తప్పుదోవ పట్టిస్తున్నారన్నారని ఆరోపించారు.బోట్లు, లాంచీలు తీయడంలో ఎక్స్ పర్ట్ అయిన శివ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి..