హైదరాబాద్ : సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త పంథాను ఎంచుకుంటున్నారు. కాదేదీ చోరీకి అనర్హం అన్నట్లు…ఏ పద్ధతి లావాదేవీ అయినా ఖాతాదారులను గజ మోసగాళ్లు బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా గూగుల్ పే ద్వారా ఓ ఆగంతకుడు ఓ మహిళ ఖాతా నుంచి రూ.94 వేలు కొల్లగొట్టేశాడు. కొండాపూర్‌కు చెందిన ఓ మహిళ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తూ ఇటీవల మానేసింది. తన ఫేస్‌బుక్ ఖాతాలో ఆమె ఓ పాత ఫ్రిజ్‌ను రూ.18 వేలకు అమ్మకానికి పెట్టింది. ప్రకటన చూసిన ఓ అపరిచితుడు ఆమెకు ఫోన్ చేశాడు. సరిగ్గా తాను ఇలాంటి ఫ్రిజ్‌నే కొనాలనుకుంటున్నానని నమ్మబలికాడు. ఆన్‌లైన్‌లో పూర్తిగా డబ్బు చెల్లించిన తర్వాతే ఫ్రిజ్‌ను తీసుకెళతానని సత్య హరిశ్చంద్రుడిలా ఫోజు పెట్టాడు. గూగుల్‌పేకు అనుసంధానమై ఉన్న ఆమె మొబైల్ ఫోను నంబరు చెబతే డబ్బు పంపిస్తానన్నాడు. ఆమె నంబరును తెలియజేసింది. మొదట రూ.7 వేలు పంపిస్తున్నానని నమ్మించాడు. మరో విడతగా కొంత సొమ్మును పంపిస్తున్నానని తెలిపాడు. ఆ విధంగా చేస్తూ…గూగుల్‌పే యాప్‌కు తాను పంపిస్తున్న సందేశాలను యాక్సెప్ట్ చేయాలని కోరాడు. అయిదు విడతలుగా ఆమె అలా అంగీకారాలు తెలిపింది. తర్వాత ఆమె తన ఖాతాను తనిఖీ చేస్తే రూ.18 వేలు రాలేదు కదా…రూ.94 వేలు పోయాయి. డబ్బు పంపిస్తున్నట్లు నటిస్తూ ఆ ఆగంతకుడు ఆమె ఖాతా నుంచి మొత్తాలను లాగేసుకున్నాడు. గూగుల్‌పే యాప్‌లో పే బదులుగా యాక్సెప్ట్ ఆప్షన్‌ను ఎంచుకుని ఆమె ఖాతా నుంచి డబ్బు కొట్టేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఓఎల్‌ఎక్స్ మోసాల్లో ‘ఘనాపాఠీ`లుగా పేరు పొందిన భరత్‌పూర్ నేరగాళ్లే ఈ మోసానికి పాల్పడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కనుక గూగుల్‌పే యాప్‌లో లావాదేవీలు నిర్వహించేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.