నాటకీయ పరిణామాల మధ్య సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడంతో అధికారంలోకి వచ్చిన యడియూరప్ప నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మాజీ సీఎం సిద్దరామయ్య నేతృత్వంలో గత కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన పలు పథకాలపై విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది.కాంగ్రెస్ హయాంలో చెత్త విభజన వాహనాల కొనుగోలులో,క్వారీల్లో లైనర్ల ఏర్పాటు,కృషిభాగ్య పథకంలో,చెత్త విభజన ప్లాంట్ల ఏర్పాటులో వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందంటూ ఆరోపణలు రావడంతో వీటిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సీబీఐకి సీఎం బీఎస్. యడియూరప్ప సూచించినట్లు తెలుస్తోంది. బెంగళూరులో చెత్త సేకరించి దానిని వేరు చేసి విభజించడానికి ఉపయోగించే వాహనాల కొనుగోలు కాంట్రాక్టు (టీపీఎస్) ఇచ్చే ముసుగులో రూ. 96 కోట్లు గోల్ మాల్ జరిగిందని ఆరోపణలు ఉన్నాయి.బాగలూరు, మిట్టగానహళ్ళి క్వారీల దగ్గర లైనర్లు ఏర్పాటు చేసే కాంట్రాక్టులో రూ. 109 కోట్ల అవినీతి జరిగిందని కృషి భాగ్య పథకంలో రూ. 9,014 కోట్లు అవినీతి జరిగిందని, చెత్త వేరు చేసే కాంట్రాక్టు విషయంలో రూ. 1,066 కోట్లు గోల్ మాల్ జరిగిందని, వైజ్ఞానిక చెత్త వేరే చేసే ప్లాంట్ లు ఏర్పాటు చేసే ముసుగులో రూ. 4,010 కోట్ల అవినీతి జరిగిందని బీజేపీ నాయకుడు ఎన్ఆర్. రమేష్ ఆరోపించారు.కృషి భాగ్య పథకానికి సంబంధించి ఆయా జిల్లాల వ్యవసాయ శాఖ (కృషి) డైరెక్టర్లను విచారణ చేసి, రికార్డులు పరిశీలించి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి యడియూరప్ప ఆదేశాలు జారీ చేశారు.కర్ణాటక మాజీ మంత్రి కృష్ణభైరేగౌడ, వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శులు, 26 జిల్లాల వ్యవసాయ శాఖ డైరెక్టర్లు, 131 తాలుకాల వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు చిక్కుల్లో పడుతున్నారు. చెత్త వేరు చేసే కాంట్రాక్టుల విషయంలో మాజీ మంత్రి కేజే. జార్జ్, 41 మంది చెత్త సేకరించే కాంట్రాక్టర్లు, టీపీఎస్ సంస్థ నిర్వహకులు, రాణాజార్జ్ భాగస్వామి సందీప్ రెడ్డి తదితరులు, రాజకీయ నాయకులు, అధికారులు సమస్యలు ఎదుర్కోవడానికి సిద్దం అయ్యారు.దీంతో సిద్దరామయ్యతోపాటు ఆ ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన కాంగ్రెస్ నాయకులు, కాంట్రాక్టటర్లు, అధికారులు చిక్కుల్లో పడ్డారని వార్తలు వెలువడుతున్నాయి.