కార్యకర్తలపై దాడులు ఖండిస్తూ తెదేపా అధినేత చంద్రబాబునాయుడు పిలుపునిచ్చిన ఛలో ఆత్మకూరులో భాగంగా తెదేపా ఎమ్మెల్యేలు,నేతలు ఆత్మకూరుకు వెళ్లకుండా అడ్డుకోవడానికి పోలీసులు ఎమ్మెల్యేలు,నేతలను ఎక్కడిక్కడ అడ్డుకుంటున్నారు.అందులో భాగంగా మాజీ మంత్రి అఖిల్ ప్రియను సైతం పోలీసులు గృహనిర్బంధం చేశారు.విజయవాడ నగరంలోని నోవాటెల్‌లో ఉన్న అఖిల ప్రియ ఆత్మకూరుకు వెళ్లడానికి బయటకు రావడానికి ప్రయత్నించగా అడ్డుకున్న పోలీసులు ఆమెను గృహనిర్బంధం చేశారు.అఖిలతో పాటు సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి గదిని కూడా పోలీసులు తనిఖీ చేశారు.తన సోదరుడి గదిని తనిఖీ చేయడంపై అఖిలప్రియ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడులో 144 సెక్షన్ ఉంటే విజయవాడలో హోటల్ లో ఉన్న తన పైన ఆంక్షలు ఏంటని అఖిల ప్రశ్నించారు. ఒక దశలో పోలీసులు..అఖిల మద్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.తాను టిఫిన్ చేయటానికి కూడా కిందకు వెళ్లకూడదా అంటూ అఖిల ప్రశ్నించారు. అయినా పోలీసులు వినిపించుకోలేదు. ఇదే సమయంలో తన సోదరితో వాగ్వాదం జరుగుతున్న సమయంలోనే అఖిల సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి సైతం పోలీసులను నిలదీసారు. ఆ సమయంలో ఆయన బస చేసిన రూం ను కూడా పోలీసులు తనిఖీ చేసారు. దీని పైన అఖిల ఆగ్రహం వ్యక్తం చేసారు. కాసేపు వాగ్వాదం తరువాత అఖిల తన రూం లోకి వెళ్లిపోయారు.