గుంటూరు జిల్లా ఆత్మకూరులో తెలుగుదేశం నేతలు,కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చిన ఛలో ఆత్మకూరుకు అనుమతి లేదంటూ పోలీసులు తనతో పాటు లోకేశ్‌ను గృహ నిర్బంధం చేయడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి నిరసనగా చంద్రబాబు 12 గంటల నిరహార దీక్షకు నిర్ణయించారు. టీడీపీ నేతల హౌస్ అరెస్ట్ ను ఖండించారు, టీడీపీ నేతల అరెస్ట్… గుంటూరు బాధితులకు ఆహారం వెళ్లనీయకుండా అడ్డుకున్నారని ఆరోపిస్తూ చంద్రబాబు 12 గంటల నిరహార దీక్షకు దిగారు. ఉదయం 8 గంటలకు తన నివాసంలో ప్రారంభించిన దీక్ష రాత్రి 8 గంటల వరకు కొనసాగుతుందని ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కేడర్ మొత్తంగా దీక్షలు నిర్వహించాలని చంద్రబాబు సూచించారు. ఇది ప్రజాస్వామ్యంలో చీకటి రోజుగా చంద్రబాబు అభివర్ణించారు. బాధితులకు అండగా అందరూ నిరసనల్లో పాల్గొనాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.ఇంట్లోనే నిరాహార దీక్ష చేపట్టిన చంద్రబాబు ఇప్పుడు తాను పల్నాడుకు వెళతానంటూ బయటకొచ్చారు. దీంతో మరోసారి చంద్రబాబు నివాసం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రశ్నించే గొంతును నొక్కడం ప్రజాస్వామ్యమా అని పోలీసులను నిలదీశారు. పునరావాస శిబిరానికి ఆహారం, నీటి సరఫరాను అడ్డుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు.ఇది అమానుషమని అన్నారు. పునరావాస శిబిరంలో ఉన్న వారికి ఆహారం అందించేందుకు వెళ్లిన తమ వారిని అడ్డుకోవడంపై చంద్రబాబు మండిపడ్డారు.ప్రజాస్వామ్యంలో ఉన్నామా, నిరంకుశ పాలనలో ఉన్నామా అని ప్రశ్నించారు.వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ దుర్మార్గాలను ప్రతి ఒక్కరూ కూడ ఖండించాలని కోరారు.న్యాయం చేయాలని కోరితే తమపై కక్షపూరితంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని చంద్రబాబునాయుడు ఆరోపించారు.