మద్యం విక్రయించడానికి పట్టభద్రుల పోటీ..

మద్యం విక్రయించడానికి పట్టభద్రుల పోటీ..

సంక్షేమ పథకాలు,రేషన్ సరుకులను లబ్ది దారుల ఇంటికి తీసుకెళ్లి ఇవ్వడానికి ఏదైనా సమస్యల గురించి ప్రభుత్వానికి అర్జీ పెట్టుకోవడానికి గ్రామ వలంటీర్లు,గ్రామ సచివాలయ ఉద్యోగులను నియమించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెల నుంచి ఎక్సైజ్ శాఖ పర్యవేక్షణలో మద్యం దుకాణాలు నిర్వహించడానికి సిద్ధమైంది. మద్యం దుకాణాల్లో సైతం సేల్స్‌మేన్‌,సూపర్‌వైజర్‌ నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.అందులో ఇంటర్,డిగ్రీ అర్హతగా ప్రకటించగా పట్టభద్రులు,పోస్టు గ్రాడ్యుయేట్లు వంటి ఉన్నత విద్యావంతులు సైతం దరఖాస్తు చేసుకోవడం విస్మయపరుస్తోంది.దీంతో.. ఇప్పుడు ఏపీలో సచివాలయ పోస్టులకే కాదు..మద్యం అమ్మకాల పోస్టులకు డిమాండ్ పెరిగింది.మద్యం దుకాణాల్లో సేల్స్‌మేన్‌,సూపర్‌వైజర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల విద్యార్హతలు చూసి అధికారులు నివ్వెర పోయారు. సచివాలయ పోస్టులకు దాదాపు 21 లక్షల మంది పోటీ పడ్డారు. అయితే పరీక్షల నిర్వహణలో భాగంగా ప్రశ్నాపత్రాలు చాలా కష్టంగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అయింది.ఇదే సమయంలో మద్యం దుకాణాల్లోని పోస్టులను రాజకీయ నాయకులు, అధికారులు కలిసి భారీగా ముడుపులు తీసుకుని కొందరికి కేటాయించేశారని పలు ప్రాంతాల్లో ఆరోపణలు చేస్తున్నారు.మద్యం దుకాణాల్లో ఉద్యోగాలను తమకు సిఫార్సు చేయాలంటూ ఎమ్మెల్యేలు,మంత్రుల కోసం పని చేసిన ద్వితీయ శ్రేణి నాయకుల నుండి ఒత్తిడి పెరుగుతోంది. దీంతో.. అనేక మంది ఆ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు.ఇప్పటికే గ్రామ వలంటీర్లు,సచివాలయ పోస్టులను చాలా ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు,మంత్రులు తమకు కావాల్సిన అభ్యర్థులకు లేదా డబ్బులు తీసుకొని విక్రయించుకున్నారంటూ ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో మద్యం దుకాణాల్లో ఉద్యోగాల్లో సైతం వేలు పెడుతున్నట్లు ఆరోపణలు రావడం ప్రభుత్వానికి తలనొప్పిగా పరిణమించింది..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos