తుని : తూర్పు గోదావరి జిల్లా తుని పట్టణంలోని ముక్తిలింగంవారి వీధిలో ఓ పాడుబడిన ఇంట్లో అప్పల సుబ్రహణ్యం (75) అనే పేద పురోహితుడు ఉంటున్నాడు. అయినవాళ్లు ఆదరించకపోవడంతో ఒంటరివాడయ్యాడు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతూ మంగళవారం కన్నుమూశాడు. చుట్టుపక్కల వారు ఆయన బంధువులకు కబురును చేరవేశారు. బుధవారం వారు అంతిమ సంస్కారాలను పూర్తి చేసి ఇంట్లో వస్తువులు ఏమున్నాయో చూడసాగారు. ఓ దృశ్యం చూసి వారి కళ్లను వారే నమ్మలేకపోయారు. కొన్ని సంచుల్లో చిల్లర నాణేలు, మడతపెట్టిన నోట్లు కనిపించాయి. లెక్కించడం మొదలుపెట్టారు. ఎంతకూ పూర్తి కాకపోవడంతో నోట్లను లెక్కించే మిషన్ను తెప్పించారు. మొత్తం రూ.6 లక్షల పైచిలుకు ఉన్నట్లు తేలింది. ఇటీవల రాజమండ్రిలో ఓ వృద్ధ సాధువు మరణించాడు. అతని జోలె సంచిలో రూ.లక్షా 80 వేలు బయటపడింది.