ప్రజాప్రతినిధులు ప్రజల పట్ల తమ బాధ్యతను విస్మరిస్తున్నా కొంతమంది ఐఏఎస్,ఐపీఎస్ అధికారులు మాత్రం విధి నిర్వహణలో నిబద్దత, నిజాయితీతో వ్యవహరిస్తూ అక్రమాలపై ఉక్కుపాదం మోపుతూ అక్రమార్కుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు.రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో విధులు నిర్వర్తిస్తున్న ఐఏఎస్,ఐపీఎస్ అధికారులు అక్రమాలపై ఏస్థాయిలో విరుచుకుపడుతున్నారనే వార్తలు చాలానే చూశాం.ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ కూడా అక్రమ లేఅవుట్లు,రియల్ మాఫియాకు వణుకు పుట్టిస్తూ వార్తల్లో నిలిచారు.ఆదిలాబాద్ జిల్లాలో ఒక్కరోజే రూ.200 కోట్ల విలువ చేసే అక్రమ లేఅవుట్లు తొలగించి దివ్య దేవరాజన్ సంచలనం సృష్టించారు.ఎలాంటి అనుమతులు లేకుండా రైతుల వద్ద నుండి భూములను కొనుగోలు చేసి అక్రమ లేఅవుట్లు వేసి ప్లాట్లు చేసి అమ్మి కొనుగోలు చేసిన వారిని రియల్ ఎస్టేట్ వ్యాపారులు నిలువునా మోసం చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో కేవలం ఆరు వెంచర్లకు తప్ప, మిగతా అన్నింటికీ ఎలాంటి అనుమతులు లేవని గుర్తించిన అధికారులు వెంచర్ల లో ఉన్న రాళ్ళను పీకి భూమిని చదును చేశారు. ఒక్క రోజులో దాదాపు 135 వెంచర్లను తొలగించి అధికారులు రికార్డు సృష్టించారు.ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జిల్లా వ్యాప్తంగా అక్రమ లేఅవుట్ లను కూల్చివేయటం చర్చకు కారణమవుతోంది. అనుమతులు లేని అక్రమ లేఅవుట్లను జేసిబిలతో తొలగించేస్తున్నారు.ఎటువంటి రాజకీయ ఒత్తిడులకు తలొగ్గకుండా అక్రమ లేఅవుట్ల తొలగింపు ప్రక్రియ చేపట్టారు. అంతే కాదు ఎలాంటి అనుమతులు లేని లేఅవుట్లలో ప్లాట్లను కొనుగోలు చెయ్యొద్దని ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని నిర్ణయించారు . ఇక అనుమతులు లేని లేఅవుట్ల ముందు టౌన్ ప్లానింగ్ అధికారులు అనుమతులు లేని ఫ్లాట్ లను ఎవరు కొనుగోలు చేయవద్దంటూ బ్యానర్లు పెట్టి మరీ ప్రచారం చేస్తున్నారు. అయితే ఇప్పటికే ప్లాట్లను కొనుగోలు చేసిన వారు కలెక్టర్ అక్రమ లేఅవుట్లలో రాళ్ళను తొలగించటంతో ఆందోళనలో ఉన్నారు.వెంచర్ చేసిన యజమానులను నిలదీస్తున్నారు.అక్రమ లేఅవుట్ల తొలగింపు యాక్షన్ ప్లాన్ లో భాగంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన దివ్య దేవరాజన్ ఆదిలాబాద్ జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల 20 ఏళ్ల సామ్రాజ్యాన్ని ఒకే ఒక్క రోజులో నాశనం చేశారు . ఎవరి మాట లెక్కచేయకుండా తన పని తాను చేసుకుపోతున్న కలెక్టర్ తీరు పట్ల గుర్రుగా ఉన్న రాజకీయ నేతలు ఆమెను ఎలాగైనా బదిలీ చేయించాలని చూస్తున్నారు.మరోవైపు ప్రజల నుంచి ఒత్తిళ్లు ఎక్కువ అవుతుండడంతో దివ్య దేవరాజన్ ఉండగా వ్యాపారం చేయడం కష్టమని భావించిన రియల్టర్లు వారికి అండగా ఉంటున్న రాజకీయ నేతలు తమ పలుకుబడిని ఉపయోగించి దివ్య దేవరాజన్‌ను ఎలాగైనా బదిలీ చేయించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట..