ముంబై: గత మూడు రోజులుగా భారీ నష్టాలతో సతమతమైన స్టాక్ మార్కెట్లు శుక్ర వారం కాస్త కోలుకున్నాయి. ఉద్దీపన చర్యలు, సంపన్నులపై సర్ ఛార్జీని ప్రభుత్వం రద్దు చేస్తుందనే వార్తలు ఇందుకు కారణం. రూపాయి క్షీణతతో గత కొన్ని రోజులుగా నష్టాల్లో సాగిన సూచీలు శుక్ర వారం ఉదయ మూ కూలాయి. ఆరంభ ట్రేడింగ్లో సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా పతనమైంది. నిఫ్టీ కూడా 10,700 దిగువ ట్రేడ్ అయ్యింది. మధ్యాహ్నం తర్వాత లోహ, ఆటోమొబైల్, ఫార్మా, ఔషధ, ఐటీ రంగాల కొనుగోళ్లు మొదలు కావటంతో సూచీలు నష్టాల నుంచి లాభాల బాట పట్టాయి. మొత్తంగా నేటి ట్రేడింగ్లో సెన్సెక్స్ 228 పాయింట్లు ఎగబాకి 36,701 వద్ద, నిఫ్టీ 88 పాయింట్ల లాభంతో 10,829 వద్ద స్థిరపడ్డాయి. డాలర్తో రూపాయి మారకం విలువ 71.66గా కొనసాగుతోంది. ఎన్ఎస్ఈలో వేదాంత, యూపీఎల్ లిమిటెడ్, భారత్ పెట్రోలియం, యస్ బ్యాంక్, జీ ఎంటర్టైన్మెంట్స్ షేర్లు లాభ పడ్డాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ, ఐషర్ మోటార్స్, కొటక్ మహింద్రా బ్యాంక్, ఐటీసీ షేర్లు నష్ట పోయాయి.