బెదిరించి.. అకృత్యానికి తెగించి

  • In Crime
  • January 14, 2019
  • 207 Views
బెదిరించి.. అకృత్యానికి తెగించి

రాష్ట్ర రాజధానిలో చోటు చేసుకున్న ఘోరం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తొలుత ఓ యువకుడు బాలికకు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేయడం.. ఆ విషయం తెలిసిన అతని స్నేహితులు ఒకరి తర్వాత మరొకరు మూడేళ్లుగా అఘాయిత్యానికి పాల్పడుతున్న దురాగతం ఆదివారం బహిర్గతమైంది. నిందితుల్లో ఒకరిని కేసులో సాక్షిగా పేర్కొన్నారంటూ బాధితురాలి తరఫున పలువురు ఆందోళనకు దిగడం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్‌లోని పాతబస్తీ కామాటిపురా పోలీసుస్టేషన్‌ పరిధిలో ఈ దారుణం చోటుచేసుకుంది. రాజస్థాన్‌కు చెందిన వ్యక్తి కామాటిపురా మురళీనగర్‌లో ఉంటూ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అతని కుమార్తె(16) ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అదే ఇంట్లో పైఅంతస్తులో వ్యాపారి సోదరి కుమారుడు రాజేశ్‌ముద్దా అలియాస్‌ రాజు ఉండేవాడు. జగదీశ్‌ మార్కెట్‌లో ఓ దుకాణంలో పనిచేసేవాడు. 2015లో ఓరోజు వ్యాపారి కుమార్తెకు మత్తు మందు కలిపిన శీతలపానీయం ఇచ్చి లొంగదీసుకున్నాడు. ఆ సమయంలో కొన్ని దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. కొంతకాలం తర్వాత బాలిక కుటుంబీకులతో వచ్చిన విభేదాల కారణంగా మకాం మార్చేశాడు.

మద్యం మత్తులో స్నేహితులకు చేరవేత
ఓసారి మద్యం సేవించిన క్రమంలో విషయాన్ని తన స్నేహితులు శుభంవ్యాస్‌(25), అభిజిత్‌(24)కు చెప్పడమే కాక తన సెల్‌ఫోన్‌లోని దృశ్యాలను వారికి పంపాడు. వాటిని తమ ఫోన్లలో నిక్షిప్తం చేసుకున్న వ్యాస్‌, అభిజిత్‌ బాలికను బెదిరించడం ఆరంభించారు. ఒకరి తర్వాత మరొకరు వీలు చిక్కినప్పుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం బయటికి చెబితే కుటుంబసభ్యులను చంపుతామని బెదిరించడంతో బాలిక మిన్నకుండిపోయింది. ఇటీవలికాలంలో వేధింపులు అధికం కావడంతో తల్లిదండ్రులకు చెప్పింది. గత నెల 24న బాధిత కుటుంబం కామాటిపురా పోలీసులను ఆశ్రయించడంతో విషయం బహిర్గతమైంది. తనపై పలువురు అత్యాచారం చేశారని బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు నిందితులను అదే నెల 31న అరెస్టు చేశారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు.

ఏసీపీకి కేసు దర్యాప్తు బాధ్యత
కేసు దర్యాప్తులో పారదర్శకత కొరవడిందని బాధితురాలికి మద్దతుగా పలువురు ఆదివారం మురళీనగర్‌తోపాటు ఠాణా ఎదుట ఆందోళన చేపట్టారు. మరో నిందితుడు విజయ్‌కుమార్‌(25)ను కేసులో సాక్షిగా చేర్చారని, మరికొందరు నిందితులను పట్టుకోలేదంటూ ఆందోళనకారులు నిరసనకు దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దక్షిణ మండలం, టాస్క్‌ఫోర్స్‌ అదనపు డీసీపీలు రఫీక్‌, చైతన్యకుమార్‌ బృందం ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని అదుపు చేశారు. బాధితురాలి నుంచి వాంగ్మూలం సేకరించారు. ఇప్పటికే అరెస్టయిన ముగ్గురు నిందితులతోపాటు విజయ్‌కుమార్‌, మరో ఏడుగురు తనపై అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు ఈ సందర్భంగా వెల్లడించింది. మరోమారు కేసు దర్యాప్తు చేసి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన సద్దుమణిగింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos