ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఉండి నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన పీవీఎల్ నరసింహరాజు ప్రస్తుతం ఉండి నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్‌గా వ్యవహరిస్తున్నారు.ఈ క్రమంలో ఓ సమావేశంలో మాట్లాడుతూ..వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్వయంగా పిలిచి మరీ ఉండి నుంచి పోటీ చేయాలని కోరారని అందుకే ఎన్నికల బరిలో దిగానన్నారు.ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ పొద్దున్నే క్యారియర్ తెచ్చుకొని మరీ సాయంత్రం వరకు నియోజకవర్గంలో ఉండి పార్టీ కోసం పనిచేస్తూ ప్రజల సమస్యలు తీరుస్తున్నట్లు చెప్పుకొచ్చారు.అంతేకాదు ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ నుంచి తాను రూపాయి కూడా తీసుకోలేదని చెప్పుకొచ్చారు. అంతటితో ఆగకుండా పక్క నియోజకవర్గాలకు రూ.15 కోట్లు చొప్పున జగన్ ఇచ్చారని తాను మాత్రం డబ్బులు తీసుకోలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.తాను పార్టీ కోసం, ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం పీవీఎల్ ఎన్ రాజు వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.