జైపూర్ : రాజస్థాన్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టానికి విస్తృత ప్రచారం కల్పించడానికి ఆ రాష్ట్ర పోలీసులు వినూత్న పంథాను ఎంచుకున్నారు. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న జంటలపై దాడులకు దిగితే…జీవిత ఖైదుతో పాటు రూ.5 లక్షల జరిమానా విధిస్తారనేది కొత్త చట్టం. సామాజిక మాధ్యమాల్లో దీనికి ప్రచారం కల్పించడానికి హిందీ చిత్రం మొఘల్-ఏ-ఆజం చిత్రంలోని సన్నివేశాన్ని ఎంచుకున్నారు. అందులో అనార్కలీ (మధుబాల), యువ రాజు జహంగీర్ (దిలీప్ కుమార్) ప్రేమించుకుంటారు. అనార్కలి ఆస్థాన నర్తకి అనే చిన్న చూపు ఉంటుంది. కనుక ఈ ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోరు. ఈ సన్నివేశానికి కొత్త చట్టాన్ని జోడించిన పోలీసులు, జాగ్రత్తగా ఉండండి..మొఘల్ సామ్రాజ్యం కాదిది అని ట్వీట్ చేశారు. ప్యార్ కియాతో డర్నా క్యా (ప్రేమిస్తే భయపడాలా?) అనే పాట అందరికీ సుపరిచితమేనని, దీని ద్వారా కొత్త చట్టానికి విస్తృత ప్రచారం కల్పించదలిచామని రాజస్థాన్ పోలీసు మీడియా టీమ్ అధిపతి మారుతీ జోషి తెలిపారు.