అమరావతి : రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి క్యాలెండర్ను తయారు చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన విద్యాశాఖపై సమీక్షను నిర్వహించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు కూడా ఉండాని ఆదేశించారు. పాఠశాలల్లో మరుగుదొడ్లు, ఫ్యాన్లు, లైట్లు, తాగు నీరు లాంటి ప్రాథమిక సదుపాయాలను కల్పించాలని కూడా ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ మాట్లాడుతూ తొలి విడతలో 12,918 ప్రాథమిక పాఠశాలలు, 3,832 ప్రాథమికోన్నత పాఠశాలల రూపురేఖలు మార్చాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. రాష్ట్రంలోని 42,655 పాఠశాలల వీడియోలు, ఫొటోలు తీశామని, దాదాపు 10.88 లక్షల ఫొటోలను కూడా అప్లోడ్ చేశామని అధికారులు సమావేశంలో వివరించారని చెప్పారు. అన్ని సదుపాయాలు కల్పించిన తర్వాత మళ్లీ ఫొటోలు తీసి ప్రజలకు అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి ఆదేశించారని వెల్లడించారు.