హోదా రాకపోతే ఏపీలో అడుగుపెట్టను

హోదా రాకపోతే ఏపీలో అడుగుపెట్టను

అనంతపురం: కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రధాని అయ్యాక ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే తాను రాష్ట్రంలో అడుగు పెట్టబోనని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా పర్యటనలో ఆయన ఈ ప్రకటన చేశారు. ‘‘రాహుల్‌ గాంధీ ప్రధాని అయిన తరువాత ఏపీకి ప్రత్యేక హోదా అమలు చేసి తీరుతాం. తద్వారా రాష్ట్రానికి మేలు జరుగుతుంది. అమలు చేయలేకపోతే నా జీవితంలో శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టను. నా ఊర్లో కూడా అడుగు పెట్టను. నా ఇల్లు, ఆస్తులు, అన్నీ ఇక్కడే ఉన్నాయి. 62 ఏళ్లుగా అక్కడే జీవిస్తున్నా’’ అని రఘువీరారెడ్డి తెలిపారు.
రాష్ట్ర విభజన సందర్భంగా నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించారు. ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భాజపా కూడా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ, ఇప్పటివరకు ప్రత్యేక హోదా హామీ అమలు కాకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రత్యేక హోదాపై స్పందించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా దస్త్రంపై తొలి సంతకం చేస్తామని ప్రకటించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos