తిరువనంతపురం : కేరళను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. పెరియార్ నది ఉధృతంగా ప్రవహించడం., సమీపంలోని కాలువలో నీటి ప్రవాహం పెరగడంతో కొచ్చి విమానాశ్రయాన్ని మూసి వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు విమానాశ్రయాన్ని పునఃప్రారంభిస్తామని తెలిపారు. భారీ వరదల కారణంగా రాష్ట్రంలో ఇప్పటికే 22 మంది మరణించారు. వయనాడ్, ఇడుక్కి, మలప్పురం, కోజికోడ్ సహా తొమ్మిది జిల్లాలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించింది. కాగా సహాయక చర్యల కోసం అదనపు బలగాలను పంపాల్సిందిగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ కేంద్రాన్ని కోరారు. మలప్పురం జిల్లా నిలంబురి గ్రామంలో శుక్రవారం కొండ చరియలు విరిగి పడడంతో 30 కుటుంబాలు గల్లంతయ్యాయి. కేరళలో వరద బీభత్సం గురించి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీకి ఫోనులో వివరించారు. కేంద్ర సాయాన్ని అందించాల్సిందిగా కోరారు. ఎలాంటి సహాయన్నైనా అందిస్తామని ప్రధాని, రాహుల్‌కు హామీ ఇచ్చారు. వయనాడ్ స్థానానికి రాహుల్ లోక్‌సభలో ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.