ఎన్నికల సమయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇచ్చిన హామీల్లో మద్యపాన నిషేధం కూడా ఒకటి.దశల వారీగా రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలు చేస్తామంటూ వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చే క్రమంలో మద్యపాన నిషేధంపై కూడా వైఎస్ జగన్ దృష్టి సారించారు.అందులో భాగంగా జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు మందుబాబుల్లో గుబులు రేపుతున్నాయి.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యంపై అమలు చేసిన ఆంక్షలపై అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.మద్యపాన నిషేధం చర్యల్లో భాగంగా మద్యం బ్రాండ్ల విక్రయాలను తగ్గించడానికి ప్రభుత్వం యోచిస్తోంది.దీనివల్ల మద్యం దుకాణాల్లో బార్ అండ్ రెస్టారెంట్లలో ప్రభుత్వం అనుమతించిన పరిమిత బ్రాండ్ల మద్యం మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది.దీంతో ఇష్టమైన బ్రాండ్ మద్యం లభించక కష్టమైనా ఇష్టం లేని బ్రాండ్ మద్యాన్ని సేవించాల్సిన పరిస్థితులు తలెత్తుండడంతో మందుబాబులు అసహనం వ్యక్తం చేస్తున్నారట.అయితే అధికారుల వాదన మాత్రం అందుకు భిన్నంగా ఉంది.రాష్ట్రవ్యాప్తంగా మందుబాబులు పెద్దగా ఆసక్తి చూపని,పెద్దగా విక్రయం కానీ బ్రాండ్లను మాత్రమే తొలగిస్తామని చెబుతున్నారు. ఒకట్రెండు సార్లు అన్ని జిల్లాల్లోనూ ఏఏ బ్రాండ్లకు ఆదరణ ఉందో ఏ బ్రాండ్లకు ఆదరణ లేదో గుర్తించి ఆదరణ లేని మద్యం బ్రాండ్లను నిలిపివేస్తామని చెబుతున్నారు.అందుబాటులో ఉంచనున్న బ్రాండ్లు బాగా ఆదరణ ఉన్న మద్యం బ్రాండ్లేనని చెబుతున్న అధికారులు అందుబాటులో ఉంచనున్న మద్యం బ్రాండ్లు తొలగించనున్న మద్యం బ్రాండ్ల వివరాలు మాత్రం వెల్లడించడం లేదు.దీంతో తమకు ఇష్టమైన మద్యం దొరుకుతుందో లేదోనని మందుబాబులు మధనపడుతున్నారట. మద్యం బ్రాండ్ల కుదింపు నిర్ణయం కేవలం మందుబాబులను కాదు మద్యం వ్యాపారులు,మద్యం ఉత్పత్తి కంపెనీలను సైతం ఆందోళనకు గురి చేస్తోంది.రాష్ట్రంలో ఎక్కువ మంది తాగుతున్న బ్రాండ్లు 30 వరకు ఉండగా అందులో సగానికి లేదా పదికి కూడా కుదించే అవకాశాలు ఉన్నట్లు వ్యాపారవర్గాలు తెలుపుతున్నాయి.వందల కోట్లు ఖర్చు చేసిన డిస్టిలరీలు ఏర్పాటు చేసిన తరువాత కొన్ని బ్రాండ్లనే విక్రయించడానికి అనుమతిస్తాని చెప్పడం ఏమిటంటూ అసహనం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.మద్యం దుకాణాలకు,మద్యం ఉత్పత్తి కంపెనీలకు,ఎక్సైజ్‌శాఖకు మధ్య కొన్ని ఒప్పందాలు ఉంటాయి.మద్యం దుకాణాలకు,కంపెనీలకు ప్రభుత్వం లైసెన్స్ ఇస్తుందే మినహా ఫలానా బ్రాండ్ మాత్రమే ఉత్పత్తి చేయాలి,ఫలాన బ్రాండ్ మాత్రమే విక్రయించాలంటూ నిబంధనలు విధించలేదు.ఎక్సైజ్తో ఒప్పందం ఉన్న ఏ బ్రాండ్ను అయినా వ్యాపారులు తీసుకోవచ్చు. ఈ నేపథ్యంలో రోజూ కాకపోయినా అప్పుడప్పుడు అమ్మే వాటిని కూడా షాపులు అందుబాటులో ఉంచుతాయి.అయితే కొత్త ప్రభుత్వం అందుకు వ్యతిరేకంగా ఆదరణ లేని బ్రాండ్లను నిలిపివేస్తామంటూ చెబుతుండడంతో వ్యాపారులు ఆందోళనతో పాటు పలు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు.మద్యపాన నిషేధం అని ప్రకటన చేసిన అనంతరం కొత్త బ్రాండ్లు రావడం ఉత్పత్తిని ప్రారంభించడం ఇది జరిగిన వెంటనే కొన్ని బ్రాండ్లను అందుబాటులో ఉంచి మిగిలిన బ్రాండ్లను నిలిపివేస్తామంటూ ప్రకటించడం వెనుక కావాల్సిన వ్యక్తులకు చెందిన బ్రాండ్లను ప్రమోట్ చేసి వారికి లబ్ది చేకూర్చాలనే ప్రయత్నంగా కనిపిస్తోందంటూ ఆరోపణలు చేస్తున్నారు..