హైదరాబాద్ : పవన్ కల్యాణ్ తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవిని కలసిన చిత్రాన్ని జన సేన పార్టీ నాయకుడు నాదెండ్ల మనోహర్ ట్విటర్ వేదికగా పంచారు. తాను, కల్యాణ్ గారు చిరుతో కలిసి అద్భుతమైన సమయాన్ని గడిపామని, అనేక విషయాల గురించి చర్చించుకున్నామని తెలిపారు. చిరు జీవిత ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకమంటూ, ఆయనకు మరిన్ని విజయాలు అందాలని కోరుకుంటున్నా అని పేర్కొన్నారు. చిరుతో మరోసారి ఇలాంటి అద్భుతమైన సమావేశం జరగాలని ఆశిస్తున్నానని ట్వీట్ చేశారు. ఈ చిత్రం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. చిరంజీవి ఇప్పుడు ‘సైరా నరసింహారెడ్డి’లో నటిస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకుడు. నయనతార, తమన్నా, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, జగపతి బాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. అక్టోబరు 2న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.