భోపాల్ : కర్ణాటకలో రాజకీయ అనిశ్చితికి కారణమైన కమలనాథులు, మధ్యప్రదేశ్‌లో కూడా ఇదే రకమైన ఆటకు పావులు కదుపుతున్నారు. బుధవారం ఉదయం ఆ రాష్ట్ర శాసన సభలో ముఖ్యమంత్రి కమల్‌నాథ్, ప్రతిపక్ష నాయకుడు గోపాల్ భార్గవలు దీనిపై పరస్పరం సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్నారు. తమ ప్రభుత్వం ఐదేళ్ల పాటు పూర్తి కాలం పాలన కొనసాగిస్తుందని కమల్‌నాథ్ స్పష్టం చేశారు. తమ ఎమ్మెల్యేలెవరూ అమ్మకానికి సిద్ధంగా లేరంటూ తేల్చి చెప్పారు. పూర్తి సామర్థ్యం, సంఖ్యా బలంతో తాము పని చేస్తామని విస్పష్టంగా ప్రకటించారు. ఆయనిలా మాట్లాడుతుండగానే, గోపాల్ భార్గవకు అడ్డుతగుతూ, నంబర్ 1, నబర్ 2ల నుంచి ఆదేశాలు వస్తే ఈ ప్రభుత్వం ఒక్క రోజు కూడా నిలబడదని అన్నారు. దీనిపై తీవ్రస్థాయిలో స్పందించిన సీఎం, దమ్ముంటే అవిశ్వాస తీర్మానం పెట్టాలంటూ సవాలు విసిరారు.