హైదరాబాద్ : రాజకీయాల ద్వారా బంగారు తెలంగాణను సాధించడం అసాధ్యమని రాష్ట్ర స్టేషనరీ, ప్రింటింగ్, స్టోర్స్ కమిషనర్ వీకే సింగ్ వ్యాఖ్యానించారు. సామాజిక కార్యక్రమాలతో ప్రజల అవసరాలను తీర్చితేనే బంగారు తెలంగాణ సాధ్యమన్నారు. దీనికోసం అవగాహన కార్యక్రమాలు చేపడతానని, బంగారు తెలంగాణ సాధనకు పని చేస్తానని ప్రకటించారు. బుధవారం ఇక్కడ ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, పోలీసు వ్యవస్థతో ప్రజలకు ఎలాంటి మేలు జరగదన్నారు. చంచల్‌గూడ జైలు డీజీగా పని చేసిన తాను ఎన్నో సంస్కరణలు చేపట్టానన్నారు. ఆనంద ఆశ్రమంలో15 వేల మంది భిక్షగాళ్లకు ఆశ్రయం కల్పించామని తెలిపారు. జైల్లో అనేక మార్పులు చేపట్టానని, ఖైదీల సంక్షేమం కోసం అహర్నిశలు పని చేశానని చెప్పారు. సెలవులో ఉన్నప్పుడు తనను స్టేషనరీ, ప్రింటింగ్, స్టోర్స్ శాఖకు కమిషనర్‌గా బదిలీ చేశారన్నారు. జైళ్ల శాఖ నుంచి తనను బదిలీ చేయడంతో చాలా మంది ఉద్యోగులు బాధపడ్డారన్నారు. పోలీసు వ్యవస్థలో మార్పులు అవసరమని పేర్కొన్నారు.