కుమార సర్కార పతనం

బెంగళూరు:ఎట్ట కేలకు కర్ణాటక భాజపా అధ్యక్షుడు యడ్యూరప్ప స్వప్నం సాకారమైంది. కుమార స్వామి సారథ్యంలోని పద్నాల్గు నెలల కాంగ్రెస్ – జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం మంగళ వారం సాయంత్రం పతనమైంది. తను ప్రవేశ పెట్టిన విశ్వాస తీర్మానం వీగి పోయింది. రాజ భవన్కు వెళ్లి గవర్నర్ వాజుబాయి వాలాకు రాజీనామా పత్రాన్ని సమర్పించారు. దరిమిలా యడ్యూరప్ప నాయకత్వంలో కన్నడ నాట మరో సారి కమల ప్రభుత్వం స్థాపనకు మార్గం సుగమ మైంది. కుమార స్వామి తన వీడ్కోలు ప్రసంగంలో విపక్ష భాజపా, మాధ్యమాల్ని ఎండ గట్టారు. తన ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల్ని ఏకరువు పెట్టారు. గతంలో అధికారాన్ని హస్త గతం చేయటంలో మాట తప్ప లేదని పునరుద్ఘాటించారు.
తనకు అధికార దాహం లేదని సంతోషంతో పదవి నుంచి తప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. నిరాసక్తతతోనే రాజకీయ రంగ ప్రవేశం చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం రాజకీయ వ్యవహారాల్ని జనం క్షమించబోరని అంచనా వేసారు. సభాపతిగా బోపయ్య ఉన్నపుడు అధికార దుర్వినియోగానికి పాల్పడిన భాజపా ఇప్పుడు కాస్త ఆలస్యంగా విశ్వాస తీర్మానం పై స్పందించటాన్ని తప్పుబడుతున్నారని మండి పడ్డారు. సామాజిక మాధ్యమాల వల్ల సర్వ నాశనం జరుగుతోందని దుయ్య బట్టిన ఆయన విపక్షాల కార్యకర్తలు కాస్త సంయమనంతో వ్యవహరించాల్సి ఉందని హితవు పలికారు. మాజీ మంత్రి అరవింద లింబావళికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమల్లో ప్రసారమైన చిత్రాల్ని ఉల్లేఖించారు. ‘ దృశ్య మాధ్యమాల కంటే ముద్రణా మాధ్యమాలు మేలు. కాస్తో కూస్తో వాస్తవాల్ని రాస్తున్నాయి. దృశ్య మాధ్యమాలు మరీ మోసంగా ఉన్నాయి. ధన వ్యామోహంతో అవాస్తవాల్ని ప్రసారం చేస్తున్నాయి. ధనార్జనే ధ్యేయమైతే మరో వ్యాపకం చేసుకోవటం మంచిదని’ సలహా ఇచ్చారు. భాజపా నేతలు అత్యంత కఠిన పదజాలంతో తనకు వ్యతిరేకంగా వ్యాఖ్యానాలు చేసారని కొన్నింటిని ఉల్లేఖించారు. తమ ప్రభుత్వ కార్యక్రమాల్ని తప్ప బట్టిన భాజపా సభ్యుల నైతికతను ప్రశ్నించారు.వారి ఆరోపణలు, వ్యాఖ్యలు, విమర్శల్ని నిరాధారాలుగా కొట్టి పారేసారు.
బలాబలాలు:
శాసన సభ్యుల సంఖ్య మొత్తం 225 కాగా ఇరవై మంది సభ్యులు గైరు హాజరయ్యారు. కాంగ్రెస్ – జేడీఎస్ సభ్యుల సంఖ్య 99. విపక్ష భాజపా సభ్యుల సంఖ్య 105. విశ్వాస తీర్మానం నెగ్గేందుకు 103 మంది సభ్యుల సంఖ్యా బలం అవసరం. సభాపతి రమేశ్ కుమార్ను లెక్కించ లేదు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos