లండన్ : బ్రిటన్ కన్సర్వేటివ్ పార్టీ నాయకుడుగా బోరిస్ జాన్సన్ మంగళవారం ఎన్నికయ్యారు. ఆయన ప్రధాన మంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేస్తారు. పార్టీ నాయకత్వానికి జరిగిన ఎన్నికలో జెరెమీ హంట్‌ను జాన్సన్ ఓడించారు. ఆయన గతంలో లండన్ మేయర్‌గా పని చేశారు. బ్రిటన్‌కు నాయకత్వం వహించాలన్న ఆకాంక్ష ఆయనకు బలంగా ఉంది. 1,59,320 మంది కన్సర్వేటివ్ పార్టీ సభ్యుల్లో 87.4 శాతం మంది ఓట్లు వేశారు. 66 శాతం ఓట్లు (92,153) సాధించిన జాన్సన్ విజయ దుందుభి మోగించారు. ప్రస్తుత ప్రధాన మంత్రి థెరీసా మే బుధవారం బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో రాణి ఎలిజబెత్‌తో భేటీ అవుతారు. అనంతరం థెరీసా ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతారు. ఆ తర్వాత రాణి లాంఛనంగా బోరిస్ జాన్సన్‌ను ప్రధాన మంత్రిగా నియమిస్తారు. 2016లో జరిగిన బ్రెగ్జిట్ రిఫరెండమ్ నేపథ్యంలో యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోతోంది. ఈ సందర్భంగా అందరికీ ఆమోదయోగ్యమైన ఒప్పందం కుదుర్చుకోవడంలో ఇప్పటికే ఇద్దరు బ్రిటన్ ప్రధాన మంత్రులు విఫలమయ్యారు. కాబోయే ప్రధాని జాన్సన్ అక్టోబరు 31లోగా ఓ ఒప్పందాన్ని కుదుర్చుకోవలసి ఉంటుంది.