తిరుమల : ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నర్‌గా నియమితులైన బిశ్వభూషణ్ హరిచందన్ తిరుమలలో మంగళవారం శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ముందుగా వరాహస్వామిని దర్శించుకుని, తర్వాత శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. ఆలయం వద్ద తితిదే అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేశారు. తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌లు ఆయనను సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు, చిత్ర పటం అందజేశారు. దర్శనం తర్వాత బయటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. వేంకటేశ్వరుడి ఆలయ సందర్శన గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఎప్పటి నుంచో తిరుమలకు రావాలని అనుకుంటున్నా సాధ్యపడలేదన్నారు. ఆ భగవంతుడి ఆశీర్వాదంతో దర్శించుకునే మహద్భాగ్యం కలిగిందని చెప్పారు.