ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాహుల్‌గాంధీ రాజీనామా చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించే సమర్థుడైన నేత కోసం కాంగ్రెస్ అధిష్టానం ఎదురు చూస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాభవానికి నైతిక బాధ్యతవహిస్తూ రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఖాళీ అయిన ఆ స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలన్న అంశంపై సీడబ్ల్యూసీ ఏ నిర్ణయం తీసుకోలేకపోతోంది. గాంధీయేతరులు సైతం కాంగ్రెస్ పగ్గాలు చేపట్టవచ్చన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో పలువురు సీనయర్ నేతల్లో ఆశలు చిగురించాయి.ఏఐసీసీ అధ్యక్ష పదవి చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామంటే పరోక్షంగా తమ మనసులో మాట బయటపెట్టారు.అయితే గాంధీయేతరులు కాకుండా మరొకరు ఏఐసీసీ అధ్యక్ష పదవిని సమర్థవంవంతగా నిర్వర్తించలేరంటూ కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి రాగాలు మొదలయ్యాయి.ఏఐసీసీ అధ్యక్ష పదవి గాంధీ కుటుంబం వారసులే చేపట్టాలంటూ డిమాండ్లు వినిపించాయి.దీంతో అధ్యక్ష పదవిని తిరిగి చేపట్టాలంటూ అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేసినా విన్నవించినా రాహుల్‌గాంధీ మాత్రం అందుకు ససేమిరా అనడంతో ఏఐసీసీ అధ్యక్షుడి కోసం కాంగ్రెస్ అధిష్టానం మళ్లీ వెతుకులాట ప్రారంభించింది.ఈ తరుణంలో కాంగ్రెస్ నేతలు చూపులు నానమ్మ ఇందిరాగాంధీకి అచ్చుగుద్దినట్లే ఉండే ప్రియాంక గాంధీ వైపు మళ్లాయి.ప్రియాంక మాత్రమే కాంగ్రెస్ పార్టీని సమర్థవంతంగా నడిపించగలరనే నమ్మకం కాంగ్రెస్ నేతల్లో రోజురోజుకు బలపడుతోంది.ఈ నేపథ్యంలోనే ఏఐసీసీ అధ్యక్ష పదవి ప్రియాంకకు అప్పగించాలంటూ ఢిల్లీ నుంచి కేరళ వరకు అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ నేతలు,కార్యకర్తలు అధిష్టానాన్ని డిమాండ్ చేస్తున్నారు.లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారాలు నిర్వహించిన ప్రియాంక ప్రసంగానికి ప్రజలు అంతోఇంతో ఆసక్తి కనబరిచారని ప్రియాంకకు పూర్తిస్థాయిలో అధికారం ఇస్తే కాంగ్రెస్ పరిస్థితి తప్పకుండా మెరుగుపడుతుందని కాంగ్రెస్‌కు పూర్వవైభవం వస్తుందని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు సైతం ప్రియాంకకు ఏఐసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారంటే ప్రియాంకపై ఏస్థాయిలో నమ్మకం ఉంతో తెలుస్తోంది.కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ సీనియర్ నేత నట్వర్‌సింగ్ కూడా కాంగ్రెస్ పగ్గాలు ప్రియాంకకు అప్పగించాలంటూ డిమాండ్ చేశారు.ఏఐసీసీ అధ్యక్ష పదవికి ప్రియాంక మాత్రమే అర్హురాలని గాంధీయేతరులకు పార్టీ పగ్గాలు అప్పగిస్తే 24 గంటల్లో కాంగ్రెస్ పార్టీ నిట్టనిలువుగా చీలిపోవడం తథ్యమంటూ వ్యాఖ్యానించారు.తాజాగా కాంగ్రెస్‌కు చెందిన మరో సీనియర్ నేత శతృఘ్న సిన్హా కూడా ఇదే అభిప్రాయం వెల్లడించారు. పార్టీ అత్యున్నత పదవిలో ప్రియాంకగాంధీ ఒదిగిపోతారని శతృఘ్న సిన్హా అభిప్రాయపడ్డారు. సోన్‌భద్ర బాధితులను పరామర్శించే విషయంలో ప్రియాంక చూపిన తెగువ ప్రశంసనీయమని అన్నారు. సమస్యలపై పోరాటంలో ఆమెను మాజీ ప్రధాని ఇందిరా గాంధీతో పోల్చిన ఆయన.. ప్రజల కోసం ప్రియాంక అరెస్టులను సైతం ఆనందంగా స్వాగతించారన్నారు.ఈ ఘటనతో పార్టీని ముందుకు నడపగల సమర్థత ఆమెలో ఉందన్న విషయం స్పష్టమైందని ట్విట్టర్లో ట్వీట్ చేశారు.ప్రియాంకకు పార్టీ పగ్గాలు అప్పగించాలంటూ రోజురోజుకు డిమాండ్లు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో అధిష్టానం తీసుకునే నిర్ణయంపై కాంగ్రెస్ నేతల్లో ఉత్కంఠతతో పాటు ఆశలు కూడా పెరుగుతున్నాయి..