ఎన్నో సవాళ్లు,అవాంతరాలు,వాయిదాల అనంతరం సోమవారం మధ్యాహ్నం సరిగ్గా 02.43 నిమిషాలకు చంద్రయాన్ 2ను ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రయోగించారు.2009లో రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థతో కలసి ఇస్రో సంయుక్తంగా చంద్రయాన్2ను అభివృద్ధి చేసింది.అప్పటి నుంచి పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న చంద్రయాన్ 2 ప్రయోగం ఎట్టకేలకు ఈనెల 22వ తేదీన శాస్త్రవేత్తలు విజయవంతంగా పూర్తి చేశారు.ఈ నేపథ్యంలో చంద్రయాన్ 3పై ఇస్రో శాస్త్రవేత్తలు అప్పుడే దృష్టి సారించారు.జపాన్ దేశ సహకారంతో చంద్రయాన్ 3 ప్రయోగం చేపట్టడానికి ఇస్రో భావిస్తోంది.అందుకోసం జపాన్ దేశంతో చర్చలు జరుగుతున్నారు. ఇటీవల జపాన్ పర్యటకు వెళ్లిన ప్రధాని నరేంద్రమోదీ చంద్రుడిపై సంయుక్తంగా ప్రయోగాలు జరపడానికి చర్చలు జరిపారు.అయితే చంద్రయాన్ 3 ప్రయోగంలో జపాన్ సహకారంపై చర్చలు ఇంకా ప్రారంభ దశలో ఉన్నాయి. 2024లో చంద్రయాన్ 3 ప్రయోగం నిర్వహించేందుకు ఇస్రో సన్నద్ధమవుతోంది.అందులో జపాన్ సహకారం ఉంటుందో లేదో త్వరలో స్పష్టత రానుంది.అయితే అంతలోపు అంటే 2022లో గగన్‌యాన్ మిషన్‌ను పూర్తి చేయడానికి ఇస్రో సన్నాహకాలు మొదలు పెట్టింది.చంద్రయాన్ 2 ప్రయోగంపై స్పేస్ అండ్ ఓషెన్ స్టడీస్ ప్రోగ్రామ్ ఆఫ్ గేట్వే హౌజ్ సభ్యులు డాక్టర్ చైతన్య గిరి మాట్లాడుతూ.. చంద్రయాన్-3 చంద్రయాన్-2 లానే పనిచేస్తుందన్నారు.చంద్రుడిపై ప్రయోగాలకు సంబంధించి ఇస్రో చంద్రయాన్ 2తోనే ఆగిపోదని చంద్రయాన్ 3 కూడా విజయవంతంగా ప్రయోగించాల్సిన అవసరం ఉందన్నారు.చంద్రుడిపై పరిశోధనల్లో అగ్రదేశాలు ఇప్పటికే చాలా ముందు ఉన్నాయన్నారు.అగ్రదేశమైన అమెరికా 2024 నాటికి చంద్రుడిపై పరిశోధనలు చేయడానికి సన్నద్ధమవుతోందని మరోవైపు రష్యా కూడా లూనా 25,లూనా 26 మిషన్‌తో చంద్రుడిపైకి రోబోను పంపాలని రష్యా భావిస్తోందన్నారు.ఇక చైనా కూడా చంద్రుడిపై ప్రయోగాల్లో ముందుగానే ఉందని చాలా ఏళ్ల క్రితమే చాంగ్ 4 ప్రయోగించిన చైనా చంద్రుడి దక్షిణ ధృవ ప్రాంతంలో ల్యాండ్ అయ్యేలా చాంగ్ 5 రూపొందిస్తోందన్నారు. దీనిద్వారా చంద్రుడిపై మట్టి,రాళ్లు తీసుకువచ్చి వాటిపై పరిశోధనలు జరిపి అనంతరం మరిన్ని ప్రయోగాలపై చైనా సిద్ధమవుతోందన్నారు.ఈ నేపథ్యంలో ఇస్రో కూడా చంద్రుడిపై పరిశోధనలకు చర్యలు వేగవంతం చేయాలని చంద్రయాన్ 3 నిర్మాణం త్వరగా చేపట్టాలంటూ సూచించారు.అందుకోసం పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామితో పాటు, పలు యూనివర్శిటీలు, స్టార్టప్ కంపెనీలు, రీసెర్చ్ ల్యాబులను కూడా భాగస్వామి చేస్తే మిషన్ త్వరగా పూర్తవుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు..