భాజపా సహనానికి పరీక్ష

భాజపా సహనానికి పరీక్ష

బెంగళూరు: చేతికి అందింది నోటికి అందుతుందనే నమ్మకం లేదనేందుకు ప్రస్తుత కర్నాటక రాజకీయాలు ప్రబల నిదర్శనం. పాలక పక్షాలు దింపుడు కల్లం ఆశతో తమ అస్త్రాలకు పదును పెడుతుండగా విశ్వాస తీర్మానం వోటింగ్ ప్రతిపక్షం సహనానికి పరీక్షగా మారింది. వ్యూహాత్మకమో లేక నిస్సహాయతో కానీ విపక్షం ఆచి తూచి వ్యవహరిస్తోంది. అనుకున్నది తిన్నగా సాగక అనూహ్య మలుపులు తిరుగుతుండటం వారిలో నిరుత్సాహాన్ని నింపుతోందనటంలో సందేహం లేదు. రాజ్యాధికార సాధనలో పాలక, విపక్షాల ఎత్తుగడల్లో సోమ వారం పాలక పక్షానికి పరిస్థితులు కాస్త కలిసి వచ్చాయి. అసమ్మతీయులకు దెబ్బ మీద దెబ్బ పడింది. ఎలా కోలుకుంటారో నిరీక్షించాల్సి ఉంది. ఎతావతా పరిస్థితి మరింత సంక్లిష్టమైంది. సోమవారం సాయంత్రంలోగా విశ్వాస తీర్మానంపై వోటింగ్ జరిపి తీరేలా విధాన సభాపతిని ఆదేశించాలని అసమ్మతీయులు దాఖలు చేసిన వ్యాజ్యంపై తక్షణ విచారణకు అత్యున్నత న్యాయ స్థానం నిర్ద్వందంగా తిరస్కరించింది. మంగళ వారం పరిశీలిస్తామని పేర్కొంది. సభాపతి విధి నిర్వహణలో జోక్యం చేసుకోజాలమని తేల్చి చెప్పింది. మరో వైపు మంగళ వారం పులి మీద పుట్రలా ఉదయం పద కొండు గంటలకల్లా విచారణకు హాజరు కావాలని అసమ్మతీయులకు తాఖీదు జారీ చేసారు. అసమ్మతీయుల స్పందన ఎలా ఉంటుందో,విచారణకు హాజరు కాని పక్షంలో సభాపతి ఏ చర్యల్ని తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. వీటిన్నింటి కంటే అతి ముఖ్యమైనది. శాసన సభ్యులకు విప్ జారీ చేసే అధికారం ఆయా శాసన సభా పక్షాలకు ఉందని సభాపతి రమేశ్ కుమార్ సోమవారం ఉదయం సభ ప్రారంభమైన వెంటనే తీర్పు నివ్వటం గమనార్హం. గత శుక్ర వారం ఇదే విషయమై కాంగ్రెస్ శాసన సభా పక్ష నాయకుడు సిద్ధరామయ్య పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. అత్యున్నత న్యాయస్థానం గతంలో జారీ చేసిన తీర్పులో విప్ జారీ చేయరాదని చేసిన పరోక్ష సూచనపై సభాపతి అభిప్రాయాన్ని కోరారు. ఈ సందిగ్ధత పరిష్కారం కానంత వరకూ వోటింగ్ జరప రాదని డిమాండు చేసారు. అంతే కాకుండా ఇదే విషయాన్ని అత్యున్నత న్యాయ స్థానంలో సవాలు చేసారు. మంగళవారం ఈ వ్యాజ్యం విచారణకు రావచ్చని అధికార వర్గాల కథనం. అసమ్మతీయులు సమర్పించిన రాజీనామాలపై అమీ తుమీ తేల్చక పోతే వివాదం కొలిక్కి రాదని సోమవారం చర్చలో పాల్గొన్న మంత్రి క్రిష్ణ భైరేగౌడ సభాపతికి విన్నవించారు. రాజీనామాల్ని అంగీకరించారో లేక తిరస్కరించారో ప్రకటించాలని కోరారు. వారి రాజీనామా పత్రాలపై ఇప్పటి వరకూ సముచిత నిర్ణయాన్ని తీసుకోనందునే సభకు హాజరు కావాలని వారిపై అంక్షల్ని విధించరాదని అత్యున్నత న్యాయ స్థానం సూచించి ఉంటుందని అభిప్రాయపడ్డారు. సీనియర్ సభ్యుడు, జేడీఎస్కు చెందిని ఏటి. రామస్వామి భాజపాను వాడి పద జాలంతో విమర్శించారు. అప్రకటిత అత్యాయక పరిస్థితిని విధించి ప్రజల స్వేచ్చా స్వతంత్రాల్ని హరించి వేస్తున్నారని బైరేగౌడ దుయ్యబట్టారు. ఇదే పరిస్థితి కొనసాగితే రష్యలో మాదిరి నేతిబీరకాయ స్వాతంత్య్రమే మిగులుతుందని హెచ్చరించారు. దీనికి అడ్డు కట్ట వేసేందుకే తాము పోరాడుతున్నామన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos