కొద్ది రోజులుగా మలుపులపై మలుపులు తీసుకుంటున్న కర్ణాటక రాజకీయ పరిణామాలకు మరికొద్ది గంటల్లో తెర పడనుంది.ఎమ్మెల్యేల రాజీనామాలతో గత గురువారం నుంచి బలపరీక్షను జరగనివ్వకుండా గట్టెక్కుతున్న కుమారస్వామి నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి సోమవారం బలపరీక్ష తప్పేలా కనిపించడం లేదు.సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు బలపరీక్ష నిర్వహిస్తామని సాయంత్రం ఆరు గంటల్లోపు బలపరీక్ష పూర్తి చేస్తామంటూ సభాపతి రమేశ్‌కుమార్ స్పష్టం చేయడంతో సోమవారం సమావేశాలపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.బలపరీక్ష నేపథ్యంలో బలపరీక్ష నెగ్గి అధికారాన్ని నిలుపుకోవడానికి కాంగ్రెస్-జేడీఎస్ నేతలు సంకీర్ణాన్ని కూల్చి అధికారం చేజిక్కించుకోవడానికి బీజేపీ నేతలు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇప్పటికే శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ముంబైలో ఉంటున్న 16 మంది కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలు ఎట్టిపరస్థితుల్లోనూ బలపరీక్షకు హాజరు కాబోమంటూ స్పష్టం చేయగా మరో ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడంతో సంకీర్ణ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది.మరోవైపు 105 మంది ఎమ్మెల్యేలను కలిగిఉన్న బీజేపీ ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో 107కు సంఖ్యాబలాన్ని పెంచుకొని అధికారాన్ని చేజిక్కించుకోవడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌ను అందుకుంది.ఈ నేపథ్యంలో బలపరీక్షలో తమదే విజయమని ధీమాతో ఉన్న బీజేపీ బలపరీక్షకు పట్టుబడుతుంటే మైనారిటీలో పడిపోయిన సంకీర్ణ నేతలు బలపరీక్షను తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే అనారోగ్యం పేరుతో సీఎం కుమారస్వామి ఆసుపత్రిలో చేరగా అసంతృప్త ఎమ్మెల్యేలను బుజ్జగించడానికి చివరి ప్రయత్నంగా కాంగ్రెస్ కీలకనేతలైన సిద్దరామయ్య,శివకుమార్,పరమేశ్వర్‌లలో ఎవరో ఒకరికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి జేడీఎస్ జాతీయాధ్యక్షుడు దేవేగౌడ నిర్ణయించుకున్నారు.ముగ్గురిలో డీకే శివకుమార్‌కే ముఖ్యమంత్రి పదవి అప్పగించే సూచనలు ఎక్కువగా ఉండడంతో ఎప్పటి నుంచో ముఖ్యమంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్న శివకుమార్ ఈ అవకాశాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోరాదని నిశ్చయించుకున్నట్లు తెలుస్తోంది.దీంతో అసంతృప్త ఎమ్మెల్యేలను ఎలాగైనా వెనక్కి తీసుకురావడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం.మరోవైపు రాజీనామా చేసిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు స్పీకర్ రమేశ్ కుమార్ సమన్లు జారీ చేశారు. రేపటిలోగా వచ్చి వారి రాజీనామాలకు కారణాన్ని వివరించాలని ఆదేశించారు. కారణం సరైందని తేలకపోతే చట్టప్రకారం వారిపై అనర్హత వేటు వేస్తామని తెలిపారు. మంగళవారం అందరూ వచ్చి తనకు కనిపించాలని ఆదేశించారు..